కాంగ్రెస్ సీనియర్ నేత, కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య సుమలత ప్రసిద్ధ హీరోయిన్. అనేక తెలుగు సినిమాల్లోనూ నటించారు. వీరిద్దరికీ ఓ కుమారుడు అభిషేక్ గౌడ ఉన్నారు. మైసూర్ రాష్ట్రంలోని మాండ్యలోని దొడ్డరసినకెరెలో 1952 మే 29న హుచ్చే గౌడా, పద్మావతమ్మ దంపతులకు అంబరీష్ జన్మించారు. ఆయన అసలు పేరు హుచ్చే గౌడా అమర్నాథ్. అభిమానుల అంబీ అని ముద్దుగా పిలిచుకుంటారు.
1972లో సుప్రసిద్ధ కన్నడ దర్శకుడు పుట్టన కనగల్ తెరకెక్కించిన “నాగరాహవు” సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన కన్నడ రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 1991లో ఆయన సినీనటి సుమలతను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లోనూ అంబరీష్ కూడా తనదైన ముద్ర వేశారు. మాండ్యా నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించారు. 12, 13, 14 లోక్‌సభల్లో సభ్యునిగా వ్యవహరించారు. మధ్యలో… కొంత కాలం.. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో సమాచారశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. సిద్దరామయ్య మంత్రివర్గంలోనూ గృహనిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కావేరీ జలాల విషయంలో.. కర్ణాటకకు అన్యాయం జరుగుతోందని చెబుతూ తన పదవికి రాజీనామా చేశారు. 2013లో కాంగ్రెస్ తరఫున కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. సిద్ధరామయ్య సర్కారులో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంబరీష్ మృతిపై.. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ప్రముఖులంతా సంతాపం తెలిపారు.