ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ , మల్లు వుడ్… ఇలా ఈ గీతలన్నీ ఎప్పుడో చెరిగిపోయాయి. ఎక్కడివాళ్లైనా సరే, అన్ని భాషల్లో నటిస్తూ తమ క్రేజ్ పెంచుకొంటున్నారు. ఇది వరకెప్పుడూ లేనంతగా ఈ ప్రవాహం కొనసాగుతోంది. మోహన్ లాల్, మమ్ముట్టి, ఉపేంద్ర, ఫృథ్వీరాజ్ సుకుమారన్, ఫహద్ ఫాజిల్, సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మీ.. ఇలా పరభాషా నటులు తెలుగు సినిమాలతో మమేకమైపోతున్నారు. ఈ లిస్టులో ఇంకో పేరు చేరింది. ఆయనే… కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.
ఇప్పటివరకు కేవలం కన్నడ చిత్రాలకే పరిమితమయ్యారు శివరాజ్ కుమార్. అయితే ఆయన కూడా ప్రజంట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఇతర భాషల్లో కూడా మార్కెట్ ని పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే శివరాజ్ కుమార్ నటించిన పలు కన్నడ సినిమాలు తెలుగు లోకి డబ్ అయ్యాయి. రజనీ కాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ‘జైలర్’ లో శివరాజ్ ఒక కీలక పాత్రలో నటించి పాన్ ఇండియాకి పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో కూడా ఎంటర్ అయ్యి పలు ఆఫర్స్ సొంతంచేసుకుంటున్నారు. రామ్ చరణ్ , బుచ్చి బాబు సాన కాంబోలో వస్తున్న మూవీలో శివరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి నటించే ఓ చిత్రంలోనూ శివరాజ్ కుమార్ కనిపించబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. అదేం సినిమా అనేది తెలియాల్సివుంది. ఇవి కాకుండా ఒకట్రెండు సినిమాల్లో శివరాజ్ కుమార్‌కు కీలక పాత్రలు దక్కినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ మోహన్ లాల్, సముద్రఖని లాంటి నటుల్ని చూసీ చూసీ బోర్ కొట్టేసినవాళ్లకు శివరాజ్ కుమార్ కాస్త ఫ్రెష్‌గా అనిపించడం ఖాయం. పైగా.. శివరాజ్‌కు నెగిటీవ్ రోల్స్ చేయాలని ఆశగా ఉందట. ఆ పాత్రలకు ఆయన రూపం సరిగ్గా సరిపోతుంది కూడా. కన్నడలో శివరాజ్‌కు ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివ రాజ్ ఉంటే కన్నడ మార్కెట్‌కి తప్పకుండా ప్లస్ అవుతుంది. అందుకే దర్శక నిర్మాతల చూపు శివరాజ్ కుమార్ పై పడింది.