ఒకప్పుడు చిత్రసీమకు ఓటీటీ అనేది కల్ప తరువుగా కనిపించింది. థియేట్రికల్ బిజినెస్ జరిగినా, జరక్కపోయినా ఓటీటీ రూపంలో ఎంతో కొంత వస్తుందన్న ధైర్యం నిర్మాతలది. ఓటీటీ పేరు చెప్పుకొని చాలామంది నిర్మాతలు సేఫ్ అయిపోయారు. అయితే కాలక్రమంలో ఓటీటీ సినిమాపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. సినిమా విడుదల తేదీలు సైతం ఓటీటీ సంస్థలు నిర్ణయించే స్థాయికి వెళ్లిపోయాయి. ఓటీటీ సంస్థలు సినిమా కొనాలంటే.. ముందు వాళ్లకు సినిమా చూపించాల్సిందే. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఇదే చేస్తున్నారు. అయితే మంచు విష్ణు మాత్రం తన సినిమాని ఓటీటీలకు చూపించను అంటున్నాడు.
‘కన్నప్ప’ ఈ ఏప్రిల్ లో విడుదల కానుంది. దాదాపు రూ.100 కోట్ల పెట్టుబడితో తీసిన సినిమా ఇది. ఓటీటీ బిజినెస్ క్లోజ్ కావాల్సివుంది. అయితే అమేజాన్, నెట్ఫ్లిక్స్ సంస్థలు ఈ సినిమాని చూశాకే కొంటాం అంటున్నాయి. విష్ణు మాత్రం ‘నేను నా సినిమా చూపించను. ఇష్టమైతే కొనండి లేదంటే లేదు’ అని ఖరాఖండీగా చెబుతున్నాడు. దాంతో ఓటీటీ బేరం ఇంకా తెగలేదు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఉన్న సినిమా ఇది. ఓటీటీ పరంగా తప్పకుండా క్రేజ్ ఉంటుంది. కాకపోతే విడుదలకు ముందు అమ్మితే.. ఓటీటీ సంస్థలు ఇచ్చినంత తీసుకోవాల్సి ఉంటుంది. సినిమా హిట్టయితే, రిలీజ్ తరవాత అడిగినంత ఇస్తారన్నది విష్ణు నమ్మకం. అందుకే… ఓటీటీ రూల్స్ కి విరుద్ధంగా వెళ్తున్నాడు. నిజానికి రూ.100 కోట్లతో సినిమా తీసినప్పుడు రిలీజ్కు ముందే ఎంతో కొంత సేఫ్ జోన్లో ఉండాలనుకొంటారు. కానీ విష్ణు మాత్రం రిస్క్ తీసుకోవడానికే మొగ్గు చూపిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.