Kantara movie telugu review
తెలుగు360 రేటింగ్: .3.25/5
జానపద కథలు ఆసక్తికరంగా వుంటాయి. అలాగే అందులో వుండే నమ్మకాలు, విశ్వాసాలు, సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లని లాజికల్ గా ప్రశ్నించడం కూడా చాలా ఈజీ. రాయిలో దేవుడున్నాడా ? అధర్మం జరుగుతున్నప్పుడు బయటికివస్తాడా ? ప్రకృతిని కాపాడగలడా ? ఇలాంటి ప్రశ్నలు .. దానికి వచ్చే సమాధానాలు .. సైంటిఫిక్ చర్చ .. ఇవీ ఎప్పటికీ తెగవు. అయితే సినిమా కథకి మాత్రం జానపద జోనర్ ఎప్పుడూ ఆసక్తికరమైన ముడిసరుకే. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తయారైన ‘కాంతార’ కూడా ఒకరకంగా జానపద కథే. సెప్టెంబర్ 30న ఒక సాధారణ చిత్రంగా విడుదలైన ఈ సినిమా కన్నడలో రికార్డులు సృష్టించింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాలు ధీటుగా వుందని ప్రశంసలు అందుకుంది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి కన్నడ ప్రేక్షకుల మనసుని గెలుచుకున్న ‘కాంతార ‘తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభవం ఇచ్చింది ? ఏ కాంతారా ఏ అంశాలలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాలు సరసన నిలిచింది ?
1847లో కథ మొదలౌతుంది. కేరళ, కర్ణాటక సరిహద్దుల పంచుకుంటున్న ఓ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజుగారికి అన్నీ వున్నా మనశ్శాంతి వుండదు. మనశ్శాంతి అన్వేషిస్తూ కొండలు కోనలు అన్వేషిస్తూ తిరిగుతాడు. అనేక మంది గురువులని కలుస్తాడు. చివరికి ఓ అడవిలో ఓ చిన్న శిలని చూసి ఎక్కడ లేని ఆనందం, మనశ్శాంతి పొందుతాడు. ఆ శిలని ఇంటికి తీసుకెళ్తని అక్కడున్న ప్రజల్ని కోరుతాడు. మొదటి ప్రజలు ఒప్పుకోరు. తర్వాత ఒక షరతుపై అంగీకరిస్తారు. అడవి వాసులలో ఒకతను పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గట్టిగా ఒక ‘అరుపు’ అరుస్తాడు. ఆ అరుపు ఎంత దూరం వినిపించిందో అంత భూభాగం తమకే ఇచ్చేయాలని ‘దేవుడి’ మాటగా చెప్తాడు. రాజు కూడా వారి కోరినట్టే ఆ అడవిని దానం చేసి శిలని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. కొన్ని తరాలు గడుస్తాయి. 1990 నాటి రోజులకు కథ వస్తుంది. రాజు వారసులకు మళ్ళీ తమ భూమిని లాక్కోవాలనే దురాశ పుడుతుంది. అదే సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్ గా వచ్చిన మురళి (కిషోర్ ) అడవిని చట్టబద్దం చేసి ప్రభుత్వం ఆధీనంలో వుంచాలనే బాధ్యతని తీసుకుంటాడు. భూమిని దానం పుచ్చుకున్న అడవి తెగకు చెందిన వ్యక్తి శివ (రిషబ్ శెట్టి). మళ్ళీ భూమిని వెనక్కి లాక్కోవాలని చూసిన రాజుగారి వారసులు ఎలాంటి కుట్రలు చేశారు ? అడవి ప్రభుత్వానికి అప్పగించాలనుకున్న మురళి ఆశయం నెరవేరిందా ? అడవి తల్లినే నమ్ముకొని బ్రతుకుతున్న ప్రజల కోసం శివ ఏం చేశాడు ? అనేది మిగతా కథ.
‘కాంతార’ కథలో చాలా లేయర్స్ కనిపిస్తాయి. ఈ కథని దైవం కోణంలో, రాజు కోణంలో, అడవిని నమ్ముకొని వున్న ప్రజల రూపంలో, ధర్మానికి అధర్మానికి పోరాట రూపంలో .. భిన్నమైన కోణాల్లో చూడవచ్చు. ఒక్కో కోణంలో చూసినప్పుడు ఒక్కోలా అర్ధమౌతుంది. సినిమా తొలి సన్నివేశంలోనే కథ మొదలౌతుంది. భూత్ కోలా ఆడిన వ్యక్తి అడవిలో మాయమౌతాడు. తర్వాత శివ కథ మొదలౌతుంది. ఎప్పుడైతే శివ పరిచమౌతాడు. మొదట్లో సీరియస్ గా చూపించిన భూత్ కోలా కథ మళ్లీ చూపించడు. ”అసలు పూనకంతో ఊగిన వ్యక్తి ఎలా మాయమయ్యాడు” అనే ఎక్సయిట్ మెంట్ తో మిగతా సీన్లు అన్నీ చూస్తాడు ప్రేక్షకుడు. శివ పాత్రకు సగటు కమర్షియల్ హీరో కోటింగ్ ఇవ్వడం దర్శకుడి నేర్పుకు అద్దం పడుతుంది. దున్నపోతు ల పరుగు పందెం, స్నేహితులతో వేటకు వెళ్ళడం, దొర దేవేంద్ర, పోలీసుల తో వచ్చిన సన్నివేశాలు ఇవన్నీ కమర్షియల్ కొలతలతోనే వుంటాయి. అయితే మేకింగ్ మాత్రం చాలా ఫ్రెష్ గా వుంటుంది. కన్నడ సినిమా అయినప్పటికీ మంచి మాస్ హాస్యం పండంది. శివ కథ సరదాగా నడుస్తున్నపటికీ ‘అరుపు’ రూపంలో అసలు కథ వేరే వుందని ప్రేక్షకుడిని యంగేజ్ చేయడంతో దర్శకుడి ప్రతిభని మెచ్చుకోవాల్సిందే.
అయితే విరామం తర్వాత వచ్చే కొన్ని సీన్లు సాధారణంగానే వుంటాయి. అయితే ఇది తుఫాన్ కి ముందు వచ్చే ప్రశాంతత లాంటింది. ఎప్పుడైతే శివ అన్న గురవ హత్య జరుగుతుందో స్క్రీన్ ప్లే ఒకసారిగా జోరందుకుంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ సినిమాకి ఆయుపట్టు. ఆయా సన్నివేశాలు మామూలుగా వుండవు. చివరి పదినిమిషాలు అయితే వెన్నులో వణుకుపుట్టించేలా వుంటుంది. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. రుషభ్ శెట్టి విశ్వరూప దర్శనం చేసినట్లుగా వుంటుంది. ఇందులో ‘అరుపు’ ఒక పాత్ర గా చేశారు. క్లైమాక్స్ లో దాన్ని కథలో జోడించిన విధానం చూస్తే రచయిత తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది. చివర్లో వారహ రూపం పాటని చిత్రీకరించిన విధానం అబ్బురపరుస్తుంది. ఆ సాంగ్ లో కథలోని చాలా మెటాఫర్ లు కనిపిస్తాయి. శివ మాయమవ్వడం, గర్భవతిగా వున్న భార్య, రాయి రూపంలో వున్న దేవుడు, అడవి..ఇవన్నీ కథ సారాంశంలో అద్భుతంగా కుదిరిన సబ్ టెక్స్ట్ లు.
రిషబ్ శెట్టి కెరీర్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. తనకి లార్జర్ దెన్ లైఫ్ పాత్రది. అడవి బిడ్డ శివ పాత్రలో ఇమిడిపోయాడు. చివర్లో ఆడిన భూత్ కోలా ఎవర్ గ్రీన్ గుర్తుండిపోతుంది. హీరోయిన్ సప్తమి గౌడ కథోచితంగా చేసింది. దొర దేవేంద్ర సుత్తూరుగా కనిపించిన అచ్యుత్ కుమార్ కి మంచి మార్కులు పడతాయి. ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ పాత్ర కూడా బావుంది. హీరో స్నేహితుల పాత్రలు నవ్వులు పంచాయి.
టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా వుంది. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో వుంది. చాలా ఫ్రెష్ ఫిల్మ్ మేకింగ్. అజనీష్ లోక్నాథ్ నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. సౌండ్ డిజైనింగ్ కొత్తగా ఉంది. చాలా చోట్ల పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమాతో దర్శకుడిగా, రచయితగా రిషబ్ శెట్టి పేరు గుర్తుండిపోతుంది. తనలో చాలా ప్రతిభ వుంది. కన్నడ సినిమా కేజీఎఫ్ తో పాన్ ఇండియా విస్తరించింది. కాంతారా కన్నడ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో రుచి చూపించే సినిమా ఇది. `కాంతారా` త్వరలోనే ఓటీటీకి రావొచ్చు. కానీ అసలైన మజా అనుభవించాలంటే థియేటర్లోనే ఈ సినిమా చూడాలి.
తెలుగు360 రేటింగ్: .3.25/5