2022లో విడుదలైన ‘కాంతార’ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. కన్నడ చిత్రసీమ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసింది. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రానికి తిరుగులేని వసూళ్లు దక్కాయి. ఇప్పుడు అందరి దృష్టీ ‘కాంతార 2’పైనే. 2023లోనే సీక్వెల్ పట్టాలెక్కిస్తామని చిత్రబృందం తెలిపింది. అయితే.. కుదర్లేదు. ‘కాంతార’కు వచ్చిన అనూహ్యమైన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని, సీక్వెల్ కథపై మరింత కసరత్తు చేశారు. దాంతో ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో `కాంతార 2` సెట్స్‌పైకి వెళ్తుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది సీక్వెల్ కాదు. ప్రీక్వెల్. `కాంతార` కథ ఎక్కడైతే మొదలైందో, అంతకు ముందు జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ‘కాంతార’తో పోలిస్తే.. ‘కాంతార 2’లో రిషబ్ శెట్టి పాత్ర వినూత్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రిషబ్ సొంతూరు కదిరిలో.. ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. అక్కడే సింహభాగం షూటింగ్ జరగబోతోంది. ‘కాంతార 2’లో కొంతమంది బాలీవుడ్ నటీనటులు కనిపిస్తారని, కథానాయిక కూడా మారబోతోందని ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేలింది. దక్షిణాది నటులతోనే ‘కాంతార 2’ని పూర్తి చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ టీజర్‌ని అతి త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.