ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు.. కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసింది. దీనికి అన్నిపార్టీలు ఏకపక్షంగా మద్దతు పలికాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో ఈ చట్టం యథాతథంగా అమలవుతుంది. మరి రాష్ట్రాల్లో ఏం చేయాలి..?. రాష్ట్రాలు తమకు కావాల్సిన విధంగా మార్పులు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు ఈ పది శాతం కోటాలో.. ఐదు శాతం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. దీనిపై.. బీజేపీ సహా విపక్ష పార్టీలు.. వ్యతిరేకత వ్యక్తం చేయడం ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చడం సాధ్యం కాదనే వాదన వినిపించడం ప్రారంభించాయి. చంద్రబాబు కాపుల్ని మోసం చేస్తున్నారనే వాదనను తెరపైకి తెచ్చారు.
అయితే.. బీజేపీ, వైసీపీ నేతలు.. చెబుతున్నది నిజం కాదని.. చట్టంలో మార్పులు చేసుకోవచ్చని.. నేరుగా గుజరాత్ నుంచే.. స్పష్టమైన సూచనలు వచ్చాయి. గుజరాత్ ప్రభుత్వం.. ఆర్థికంగా బలహీనవర్గాల కోటా బిల్లులో మార్పులు చేస్తూ.. తమ రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం పాస్ చేసిన బిల్లులో… అర్హులైన వారికి ఆస్తి పరిమితి ఉంది. 105 గజాల లోపు ఇల్లు, ఐదు ఎకరాలు.. ఇలా ఆస్తి పరిమితులు పెట్టారు. దాని కన్నా ఎక్కువ ఉంటే… రిజర్వేషన్లకు అర్హులు కారని.. ప్రకటించారు. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం.. ఈ ఆస్తి సీలింగ్‌ను ఎత్తి వేయాలని నిర్ణయించింది. ఆస్తులు ఎన్ని ఉన్నా సరే.. ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉంటే చాలని తేల్చింది. ఈ మేరకు గుజరాత్ మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. అంతే కాదు… గుజరాతీయులకు మాత్రమే అంటూ.. ఓ కొత్త నిబంధనల కూడా చేర్చింది.
గుజరాత్ ప్రభుత్వం అంత ఫ్రీగా చట్టాన్ని మార్చుకున్నప్పుడు.. ఏపీ ప్రభుత్వానికి మాత్రం.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు అడ్డంకులు ఉంటాయనే ప్రశ్న సహజంగానే వస్తోంది. ఒక్క గుజరాత్ మాత్రమే కాదు.. తమ తమ రాష్ట్రాల్లో ఈ చట్టాలను అమలు చేయాలనుకునే రాష్ట్ర ప్రభుత్వాలు..మార్పులు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు అసలు అమలు చేయాలా.. లేకపోతే.. దాన్ని కేంద్రం వరకే ఉంచేస్తే సరిపోతుందా అన్న ఆలోచన కూడా చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. బీజేపీ నేతలు.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఎలా అన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు.