కాపులను బీసీల్లో చేర్చడానికి సంబంధించి, బీసీ కమిషన్ గడువును కుదించేలా, వారికి అదనపు నిధులు విడుదల చేసేలా రకరకాల డిమాండ్లతో సాగుతున్న ముద్రగడ పద్మనాభం దీక్షా శిబిరం సోమవారం నాడు వీఐపీల తాకిడికితో క్రిక్కిరిసిపోనున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగోరోజుకు ముద్రగడ దీక్ష చేరుకుంది. తన ఇంటి వద్ద పోలీసు బందోబస్తును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముద్రగడ, డాక్టర్లు వైద్యపరీక్షల నిమిత్తం వచ్చినా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాల్గోరోజుకు దీక్ష చేరుకోవడంతో పరిస్థితి ఇక విషమిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ముద్రగడ దీక్షా శిబిరం ప్రముఖుల సందర్శనలతో కిక్కిరిసిపోనుంది.
ప్రభుత్వం తరఫున ఆయనతో రాయబారాలు జరపడానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మరికొందరు మంత్రులు ఇవాళ కిర్లంపూడికి వెళ్లనున్నారు. ప్రభుత్వం బీసీల్లో చేర్చడానికి చిత్తశుద్ధితో ఉన్నదంటూనే ఆయనతో దీక్ష విరమింపజేయడానికి వారు ప్రయత్నిస్తారు. ఫైనల్గా ప్రభుత్వం ఇవ్వదగిన హామీ ఏమిటో వారు తెలియజేస్తారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవి, రఘువీరారెడ్డి కూడా ముద్రగడను పరామర్శించడానికి సోమవారమే వెళుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు కూడా పరామర్శ నిమిత్తం ముద్రగడ శిబిరానికి ఇదేరోజున వెళ్లనున్నారు. ఈ రెండు పార్టీల వారు ఆయన దీక్షకు మద్దతు తెలియజేస్తున్నారు.
మొత్తానికి అన్ని పార్టీలకు చెందిన కీలక నాయకులు వస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వీఐపీలు రానున్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.