ముద్రగడ మొండితనం లేదా పట్టుదలని పక్కన పెడితే ముఖ్యంగా తెలుగుదేశంలో వున్న కాపు ప్రముఖులెవరూ ముద్రగడ పై విమర్శలకు దిగకుండా కాపు జాయింట్ ఏక్షన్ కమిటీ (జాక్)కట్టడి చేసింది. ఈ మార్పు తరువాతే ముద్రగడకీ, ప్రభుత్వానికీ మధ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది.
ముద్రగడ పద్మనాభం దీక్షప్రారంభించక ముందు నుంచీ ఆయనమీద అధికారపార్టీలో వున్న కాపు నాయకులు దాడులు ప్రారంభించారు. ఇదంతా చంద్రబాబు నాయుడు వ్యూహంగానే భావించిన కమిటీ మొత్తం పరిస్ధితిని సమీక్షించింది. విభజించిపాలించే పద్దతికి అడ్డుకట్ట వేస్తేనే కాపుల ఐక్యత నిలుస్తుందని గుర్తించింది. విషయాన్ని ముద్రగడకే పరిమితం చేయకుండా బిజెపిలోని కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుల మీద కూడా తెలుగుదేశం లో కాపునాయకులే విమర్శలకూ దాడులకూ దిగుతూండటాన్ని కమిటీ పెద్దలు పరిశీలించారు. కాపునాయకులపై వేరేపార్టీల్లో వున్న కాపు నాయకులు విమర్శలకు దిగడమంటే అది కాపు విద్రోహమే అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధికారంలో వున్న కాపు ప్రముఖులకు ఫోన్లద్వారా తెలియపరిచారు.
మరోవైపు నీరసించిపోతున్న ముద్రగడ పద్మనాభం పట్ల సానుభూతి పెరిగిపోతూండటం కూడా ముఖ్యంగా తెలుగుదేశంలో వున్న వున్న కాపుపెద్దలపై వత్తిడి పెంచుతోంది. పరిస్ధితి ఇలాగే కొనసాగితే కమ్యూనిటీని ఫేస్ చేయడం కష్టమని ఇద్దరు సీనియర్ నాయకులు చంద్రబాబుకి వివరించారని తెలిసింది.
చర్చల మాట ఎలా వున్నా కాలయాపన జరుగదనీ, కోర్టు ఆదేశాల మేరకు ముద్రగడ ఆరోగ్యరక్షణకు చర్యలు ప్రారంభిస్తామనీ హోమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం!
హింసా విధ్వంసాలకు పూనుకున్నవారిని విడిచిపెట్టాలని ఎవరూ చెప్పరు. సంఘటన జరిగిన వెంటనే అరెస్టులు చేయడం ఒక పద్దతి…లేదా ఆగస్టు చివరికి వచ్చే కమీషన్ రిపోర్టు ఆధారంగా కాపులకు బిసి రిజర్వేషన్ వర్తింపజేయాలన్న అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపి అరెస్టులు చేయడం మరో పద్ధతి…ఈ రెండు సందర్భాల్లోనూ అరెస్టులను ఎవరూ తప్పు పట్టరు.
అందుకు భిన్నంగా అరెస్టులకు ఎంచుకున్న సమయమే తేనెతుట్టమీద రాయివిసిరినట్టయింది.
రిజర్వేషన్ల క్రెడిట్ ముద్రగడకు దక్కనీయకుండా చేయడానికే వాటి ఫలితాలు వచ్చేసరికి ముద్రగడను ఏకాకి గా చెయ్యాలనే ఈ చర్యలు తీసుకున్నారన్న విమర్శలు వున్నాయి. ఏది ఏమైనా ఇందులో మంచీ చెడులకు తెలుగుదేశం ప్రభుత్వమే బాధ్యత వహించాలి.