జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తోంది. ఒకపక్క ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, దళితుల్లో మంచి ఫాలోయింగ్ కలిగిన మాజీ ఎంపీ హర్ష కుమార్ కలిసి కాపు దళిత సమ్మేళనం నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్టు గట్టిగానే సిగ్నల్స్ వస్తున్నాయి. వీటితో పాటు మరొక మాజీ ఎంపీ చింతామోహన్ కూడా చేరే అవకాశం ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహుజన సమాజ్ వాదీ పార్టీ తో చర్చలు జరుపుతున్నారు.
ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చేరుకున్నారు. పవన్‌తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు లక్నో చేరుకున్నారు. విద్యావేత్తలు, మేధావులు, బీఎస్పీ నేతలతో జరిగే సమావేశంలోపవన్ పాల్గొననున్నారు. గతంలో జనసేనాని పవన్‌ను బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్‌సింగ్ కలిసిన విషయం తెలిసిందే. మాయావతి ఆహ్వానం మేరకే పవన్ కళ్యాణ్ ఈరోజు బీఎస్పీ నేతలతో భేటీ అవుతున్నారని తెలుస్తోంది.
ఏదేమైనా, బి ఎస్ పి పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉనికి లేనప్పటికీ ఆ పార్టీని అభిమానించే వారు దళితులలో చాలామందే ఉన్నారు. మరి జనసేన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.