కాపు, తెలగ, బలిజ, ఒంటరివారు పెద్దన్నపాత్ర పోషిస్తేనే మార్పు సాధ్యమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ సామాజికవర్గంలో విస్తృత చర్చ జరుగుతోంది. అందరూ తన వెనకు నడిస్తేనే సాధ్యమవుతుందన్న పవన్ కల్యాణ్ అభిప్రాయంతో ఎక్కువ మంది ఏకీభవిస్తున్నారు. ఆయనకు ఏకపక్షంగా మద్దతు ప్రకటించాలనే ఆలోచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కాపు జేఏసీ పేరుతో ఓ సమావేశం తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం .. రిజర్వేషన్ ఉద్యమం చేపట్టినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన ఆకుల రామకృష్ణ అనే నేత నేతృత్వం వహించారు. ఇప్పుడు కూడా ముద్రగడ ఫోటో పెట్టుకునే ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం కాపు సంఘాలన్నింటీని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో విజయవాడలో మరిన్ని సంఘాలతో విస్తృత సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్‌ను కులం పేరుతో విమర్శించడం.. దానిపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించడం వంటి కారణాల వల్ల.. ఇప్పుడు ఈ సామాజికవర్గంలో ఓ కదలిక కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దనాయకులు, మంత్రులు కాపుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడి కులాన్ని చులకన చేస్తున్నారని అంటున్నారు. ఇక తాము నాయకత్వం వహించే సమయం వచ్చిందని వారు భావిస్తున్నారు.
కాపు రిజర్వేషన్ల అంశాన్ని…మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇటీవల ఓబీసీ రిజర్వేషన్ బిల్లులో మార్పులు చేసింది.దీని ప్రకారం ఓబీసీల జాబితాలోకి ఇతర కులాల్ని ఆయా రాష్ట్రాలు చేర్చుకోవచ్చు. ఈ అంశం ఆధారంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు మళ్లీ కార్యక్రమాలు ప్రారంభించారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించకపోవడం.. దగ్గర్నుంచి అన్ని రకాల పథకాలు ఆగిపోవడం కూడా కాపుల్లో అసంతృప్తి కలిగిస్తోందని అంటున్నారు. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో.. కాపు సామాజికవర్గాన్ని తన పూర్తి స్థాయి మద్దతుదారులుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్న పవన్ కల్యాణ్‌కు మద్దతుగా వీరు త్వరలోనే తెర ముందు కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు.