విజయవాడలో 1988 జులై 10న జరిగిన కాపునాడుకు, వచ్చే జనవరి 30న తూర్పు గోదావరి జిల్లా తునిలో జరగబోయే కాపు మహాసభకు సాపత్య, వ్యత్యాసాలేమిటి? కాపులందరినీ బీసీలలో చేర్చాలన్నది ఆనాటి కాపునాడు డిమాండ్లలో ఒకటి అయినప్పటికీ, ఆ సభ ప్రధానంగా నాటి ముఖ్యమంత్రి నియంతృత్వ పాలనను తీవ్రంగా విమర్శించింది. ఐదు లక్షల మంది హాజరైన ఆ సభలో ఎన్ టి ఆర్ పై నాయకులు తిట్ల వర్షం కురిపించారు. ఆనాటి సభ కాపుల రిజర్వేషన్లపై కాకుండా కమ్మ వ్యతిరేకతపై ఫోకస్ చేసింది. తెలుగుదేశం మహానాడుకు దీటుగా జరిగిన కాపునాడు ఎన్ టీ ఆర్ ను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఆనాడు తనను పిలిచి ఆయన చాలా సేపు బాధ పడ్డారని కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ హరిరామ జోగయ్య ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో చెప్పారు. కాపు నాడు సభ జరిగినప్పుడు వంగవీటి మోహన రంగారావు జైలులో ఉన్నప్పటికీ ఆయనే అంతటి సభను విజయవంతంగా వెనుకనుండి నడిపించారు. ఆ తర్వాత రంగా హత్యకు గురికావడం, మరో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మంత్రి వర్గానికి రాజీనామా చేయడం జరిగిపోయాయి. నిజాయితీ పరుడైన మంత్రిని కోల్పోయానని ఎన్ టీ ఆర్ బాధ పడినట్టు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు ర్యాలీ అవుతున్నారు. ఆయన నేతృత్వం లోనే తునిలో కాపు మహాసభ జరగబోతోంది. రంగాకు, ముద్రగడకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. రంగాకు నేర చరిత్ర ఉన్నా మాస్ లీడర్ గా ప్రజల మన్ననలు పొందారు. ఆయనకు ఓసీ కాపులతో పాటు బీసీ కాపులలో కూడా పలుకుబడి ఉండేది. విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రభావం ఉండేది. కాపులలోనే కాకుండా బీసీ, ఎస్సీల ఆదరణ కూడా ఆయనకు లభించింది. ముద్రగడ పద్మనాభం ప్రభావం ప్రధానంగా ఓసీ కాపులకు, తూగో జిల్లాకు పరిమితంగా ఉన్నట్టు కన్పిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన అంశంగా కాకుండా చంద్రబాబు పాదయాత్ర సమయంలోనూ, 2014 ఎన్నికల ప్రచార సభల్లోనూ కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడమే మహాసభ ఎజెండాగా ఉంది. కాపులను బీసీ ల్లో చేర్పించుకోవడం, వీరి సంక్షేమానికి ఏటా 1000 కోట్లరూపాయలు ఖర్చు చేయించుకోవడం తప్ప మరో డిమాండు లేదు. ఈ మహాసభలో ఉద్వేగభరితమైన అంశాలు పెద్దగా లేవు. అయినప్పటికీ ముద్రగడ వ్యక్తిత్వం ఇవి లేని లోటును తీర్చే అవకాశముంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులకు, శెట్టి బలిజ (గౌడ్)లకు వైరం ఉంది. ఇతర బీసీ కులాలు కూడా కాపులతో అంతగా కలిసి ఉండరు. గత ఎన్నికల్లో యాదవ కులానికి చెందిన యనమల రామకృష్ణుడిని ఓడించడంలో కాపులు కీలక పాత్ర వహించారు. అయినా చంద్రబాబు నాయుడు యనమలను ఎమ్మెల్సీని, మంత్రిని చేసి కీలక స్థానంలో ఉంచారు. కాపుల కోసం సోమవారం యనమల ద్వారా ప్రకటించిన ప్యాకేజి వారిని సంతృప్తి పరిచేలా లేదు. తుని కాపు మహాసభ ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమయ్యేట్టు కన్పిస్తున్నా రాజకీయంగా ఈ మహాసభకు ప్రాధాన్యం ఉంటుంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లనే కాకుండా అనేక ఇతర కారణాల చేత ఎక్కువ శాతం కాపులు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. కాపులకు వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రత్యేక అభిమానం ఉన్నా వారు జగన్ పార్టీ వైపు అంతగా మొగ్గు చూపలేదు. తెలుగుదేశం ప్రభుత్వం మరో మెరుగైన ప్యాకేజిని ప్రకటించకపోతే ఓసీ కాపుల ఆలోచన ధోరణిలో మార్పులు రావచ్చని భావిస్తున్నారు.