ముద్రగడ పద్మనాభం అనగానే ఆంధ్ర ప్రజలకు కాపు రిజర్వేషన్ల అంశం గుర్తుకు వస్తుంది. వైయస్సార్సీపి పార్టీకి చెందిన కొందరు నేతలు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ఇటీవల ముద్రగడ పేరు ప్రస్తావించడం, ముద్రగడ ని తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యాడని విమర్శలు గుప్పించడం , దానికి సోషల్ మీడియా వేదికగా జన సైనికులు కౌంటర్స్ వేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ముద్రగడ “వ్యూహాత్మక మౌనం” పాటించడం ఆయన చిత్తశుద్ధిపై నీలి మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. అంతే కాకుండా సొంత సామాజిక వర్గం లోని ఆయన పై అసహనం వ్యక్తం అవుతోంది. దీంతో ఆయన గత వైఖరిని సైతం తెరమీదకు తెస్తూ కొందరు ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
పిఆర్పి టైం లో చిరంజీవి కి మద్దతు ఇవ్వక పోగా, చిత్తు గా ఓడిపోయిన ముద్రగడ:
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు గెలుచుకున్నది కేవలం 18 సీట్లు మాత్రమే. అయితే ఆ 18 సీట్ల లో ఒక సీటు అయిన పిఠాపురంలో ముద్రగడ చిత్తుగా ఓడిపోయిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో పిఠాపురం నుండి పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన వంగా గీత చేతిలో చిత్తుగా ఓడిపోవడమే కాకుండా మూడవ స్థానానికి పడిపోయాడని, వంగా గీత పిఠాపురం స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలవగా, రెండవ స్థానంలో టిడిపి అభ్యర్థి వర్మ నిలిచాడని, ముద్రగడ పద్మనాభం కేవలం మూడవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది అని, జగన్ పాలనలో ముద్రగడ మౌనం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్న ఆ సామాజిక వర్గ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
చిరంజీవి కి కానీ పవన్ కళ్యాణ్ కి కానీ రాజకీయంగా మద్దతు పలకని ముద్రగడ:
పవన్ కళ్యాణ్ వైయస్సార్సీపి ప్రభుత్వం అమలు చేస్తున్న కాపు నేస్తం పథకం పై, కాపులకు కేటాయించామని చెబుతున్న నిధులపై పవన్ ప్రశ్నిస్తే, దానికి నేరుగా సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు ముద్రగడ ని అరెస్టు చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. అయితే, ముద్రగడ పద్మనాభం అటు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కానీ వారికి మద్దతు పలకలేదని, తనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం వారు స్పందించాలని కోరుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు. కాపులు ఏకం కావాలని చెప్పే ముద్రగడ పద్మనాభం, ఆ పని ముందు తాను ఎందుకు చేయడనే ప్రశ్నలు ఆయనకు సొంత సామాజిక వర్గం నుండే ఎదురవుతున్నాయి.
ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సిపి తో కుమ్మక్కయ్యారా?
ఒకసారి చర్చ అంటూ మొదలయితే, సోషల్ మీడియాలో ఆ చర్చ ఎన్ని రకాలుగా దారి తీస్తుందనేది ఎవరు చెప్పలేరు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక చర్చ- ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సిపి తో కుమ్మక్కయ్యారు అన్నది. చంద్రబాబు అధికారంలోకి రాగానే, కాపు రిజర్వేషన్లు ఏమయ్యాయి అంటూ పదేపదే ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టే ముద్రగడ పద్మనాభం, జగన్ కానీ ఇతరులు కానీ అధికారంలోకి రాగానే ఎందుకు మాయమై పోతున్నాడు అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే ఇంకొక అడుగు ముందుకు వేసి, 2014 ఎన్నికలలో ఓటమి తర్వాత ముద్రగడ పద్మనాభం ని తెర మీదకు తీసుకు రావాలన్న వ్యూహరచన వైఎస్ఆర్సిపి పార్టీలోనే జరిగిందని, 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం కారణంగా ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి దగ్గరైందని, వారిని తెలుగుదేశం పార్టీ నుండి దూరం చేయడానికి ముద్రగడ పద్మనాభం ని తెరమీదకు తీసుకురావడం, తెర వెనకాల ఆయనకు కావలసిన మద్దతునివ్వడం అంతా వైఎస్ఆర్సిపి చూసుకుంది అని వారు వాదిస్తున్నారు.
కాపు లకి నిధులపై జగన్ ని శ్వేత పత్రం డిమాండ్ చేయని ముద్రగడ, కనీసం పవన్ డిమాండ్ ను స్వాగతిస్తారా?
వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాపు నేస్తం పేరిట కాపులకు ఇతోధికంగా సహాయం చేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, గత ప్రభుత్వంలో ఇచ్చిన తరహా నిధులనే, పేరు మార్చి మరో రకంగా ఇస్తోందని, ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వం తో పోలిస్తే ఇప్పుడు తక్కువగానే ఇస్తోందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ కోరారు. దీంతో అధికార వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను నేతలను రంగంలోకి దించింది. వారు వరసబెట్టి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ, ముద్రగడ ని అరెస్టు చేసినప్పుడు పవన్ ఏమయ్యాడు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిమాండ్ పై ముద్రగడ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అసలు ముద్రగడ ఈ తరహా డిమాండ్ తానే ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ పరిపాలిస్తున్న కాసేపు మౌనంగా ఉండాలనే నిబంధన ముద్రగడ తనకు తానుగా విధించుకున్నారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు సైతం వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ చేసిన సహేతుకమైన డిమాండ్ ని ముద్రగడ స్వాగతించక పోవడం, కాపులకు ఇస్తున్న నిధులపై ఇంత గందరగోళం జరుగుతున్నా బయటికి రాకుండా ముద్రగడ మౌనం పాటించడం ముద్రగడ చిత్తశుద్ధిపై అనుమానాలను కలిగిస్తోంది అంటూ వస్తున్న విమర్శలకు ముద్రగడ ఏ రకంగా సమాధానం చెబుతారు అన్నది వేచి చూడాలి.