అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి అనుమానాస్పదంగా చనిపోయారు. తాడేపల్లిలో తాను ఉంటున్న అపార్టుమెంట్లోనే అచేతనంగా పడి ఉంటే ఆస్పత్రికి తరలించారు. చనిపోయినట్లుగా గుర్తించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. రెడ్డి అండ్ రెడ్డి కంపెనీ పేరు పెట్టి వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగుల ఔట్ సోర్సింగ్ ఇతర సేవలు అందిస్తున్నారు. దాంతో పాటు ఆయన తండ్రి పేరు మీరు పీఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను నిర్వహిస్తున్నారు.
రాంకీ సంస్థ నుంచి బిల్లులు రావడం లేదన్న మంజునాథరెడ్డి తండ్రి
ఈ సంస్థ .. గుంటూరుకు చెందిన వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ ప్రాజెక్ట్స్ చేస్తున్న పనుల సబ్ కాంట్రాక్టులు చేస్తుంది. కశ్మీర్ సహా పలు చోట్ల పనులు చేస్తున్నాయి. అయితే రాంకీ సంస్థ ఇటీవల బిల్లుల చెల్లింపు విషయంలో బెట్టు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బిల్లులు రాకపోవడంతో ఆయన ఒత్తిడికి గురయ్యారు. బ్యాంకు గ్యారంటీ కోసం ప్రయత్నించినా లభించలేదని ఆయన తండ్రి చెబుతున్నారు. మరో వైపు రెడ్డి అండ్ రెడ్డి కార్పొరేషన్‌కు ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వం నుంచీ బిల్లుల బకాయి ఉందా ?
ఇలా బిల్లుల వసూలు కోసం… రాంకీ పెద్దల్ని.. ప్రభుత్వ పెద్దల్ని కలిసేందుకు నెలలో రెండు, మూడు రోజుల పాటు తాడేపల్లిలో ఉంటారు. అలా వచ్చిన ఆయన హఠాత్తుగా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన వయసు ముఫ్పై ఆరేళ్లు మాత్రమేనని చెబుతున్నారు . అయితే ఆయన విగత జీవిగా పడి ఉండటంతో ముందుగా ఆత్మహత్య అని ప్రచారం చేశారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆయన తండ్రి కడప జిల్లా నుంచి బయలుదేరి వచ్చారు. కానీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబం మాత్రం స్పందించలేదు.
అనుమానాస్పదమంటున్నా పోలీసులు ఎందుకు స్పందించరు ?
కుటుంబ కలహాలు కూడా ఉన్నాయని అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. రకరకాల ఊహాగానాలు వస్తాయని తెలిసినా క్లారిటీ ఇవ్వడం లేదు. హైప్రోఫైల్ కేసు కావడంతో పైనుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.