ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయించాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ కోటాలో భాగంగా కల్పిస్తారు. మిగిలిన వారికి ఐదు శాతం ఇస్తారు. రిజర్వేషన్లలో మహిళలకు 33శాతం ఉంటుంది. ఈ బిల్లును చర్చించి ఆమోదించడం లాంఛనమే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేసి.. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా.. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం.. తొమ్మిదో షెడ్యూల్ లో .. ఆ బిల్లును చేరిస్తే.. కాపులకు రిజర్వేషన్లు వచ్చినట్లే.
కానీ కేంద్రం.. ఆ బిల్లును పెండింగ్ లో పెట్టేసింది. అదొక్కటే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రిజర్వేషన్ల బిల్లులను పక్కన పెట్టేసి… ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు అంటూ.. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అన్ని పార్టీలు మద్దతివ్వడంతో సులువుగానే ఆమోదం పొందింది. అయితే.. రిజర్వేషన్ల తీర్మానాలు చేసిన రాష్ట్రాల్లో కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తమయింది. ఏపీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి.. ఆ పది శాతం కోటాలో.. ఐదు శాతం కాపులకు ఇవ్వాలని నిర్ణయించి.. అసెంబ్లీలో బిల్లు పెట్టారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో మార్పులు చేయకూడదని.. కొంత మంది బీజేపీ , వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అలా చేసినా చెల్లదంటున్నారు. కానీ.. కేంద్రం చేసిన చట్టం.. రిజర్వేషన్లు అమలు.. కేంద్రానికే పరిమితం. కేంద్రం భర్తీ చేసే ఉద్యోగాలు, విద్యాసంస్థలల్లో సీట్ల భర్తీ కోసం మాత్రమే అది చెల్లుబాటవుతుంది. రాష్ట్ర పరిధిలోని ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అంటే.. ఏపీలోని ఉద్యోగ, విద్యా ఇతర అంశాల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.. ప్రభుత్వం ఓ పద్దతి ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ఈ క్రమంలో మార్పులు చేసుకోవచ్చని… పలు రాష్ట్రాలు చేస్తున్నది అదేనని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్ ఇప్పటికే కొన్ని మార్పులు చేసి అమల్లోకి తెచ్చింది.