కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కాపులపై అధికార వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని, కాపులకు ఇచ్చామని చెబుతున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరగా, దానిపై వైఎస్ఆర్సీపీ తరఫున వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తీవ్రంగా స్పందించి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన విషయం తెలిసిందే. నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ఆర్థిక శాఖ మంత్రిది కాగా, వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు ఇంతలా విరుచుకుపడుతున్నారు అంటూ ఒకవైపు సెటైర్లు వినిపిస్తున్నపటికీ, ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా కాపు రిజర్వేషన్ల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో బిజెపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే మరాఠా తరహాలో కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ జనసేన అధికార ప్రతినిధి ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..
కాపు రిజర్వేషన్ల పై టిడిపి, వైఎస్ఆర్సిపి మోసం చేస్తున్నాయన్న జనసేన:
2014 ఎన్నికలలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు, మొదటి మూడు సంవత్సరాలు దీనిపై కాలయాపన చేసినప్పటికీ, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే దీనిపై తుది నిర్ణయం కోసం తీర్మానాన్ని పార్లమెంటుకు పంపించారు. అదే సమయంలో వైయస్ జగన్ అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో, కాపు రిజర్వేషన్లు ఇవ్వాలంటే 50 శాతం రిజర్వేషన్లు దాటాలి కాబట్టి , అది కేవలం కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి దీని పై తానేమీ చేయలేను అంటూ చేతులు ఎత్తేసారు. ఈ రెండు అంశాలను ప్రస్తావిస్తూ, టిడిపి వైఎస్ఆర్సిపి లు కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేశాయి అని జనసేన ప్రతినిధులు అంటున్నారు. అయితే బిజెపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా కాపు రిజర్వేషన్లు ఇస్తుందని జనసేన అధికార ప్రతినిధులు ప్రస్తుతం ప్రకటిస్తున్నారు.
2018లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ ఇచ్చిన మహా రాష్ట్ర బిజెపి:
జనసేన అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ” 2018 నవంబర్ లో మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నాయకత్వంలో మరాఠాలకు రిజర్వేషన్లు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుందని, 16 శాతం రిజర్వేషన్లను మరాఠా లకి కేటాయించిందని , రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ఉపయోగించి బిజెపి ప్రభుత్వం దీనిని అమలు చేసిందని జనసేన ప్రతినిధి వెల్లడించారు. అంతేకాకుండా కొందరు దీనిపై హైకోర్టుకు వెళ్లగా, హైకోర్టు కూడా దీనిని అంగీకరించిందని, అయితే 16 శాతం రిజర్వేషన్ లని 12 శాతానికి కుదించింది అని వెల్లడించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అన్నది కేవలం గైడ్ లైనే తప్ప రాజ్యాంగ పరమైన అడ్డంకి కాదు అని, మహారాష్ట్రలో మరాఠా లకి కేటాయించిన రీతిలో కాపులకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ, చంద్రబాబేమో పార్లమెంటుపై నెపాన్ని తోసేసి తప్పుకున్నాడని, జగన్ ఏమో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని, మళ్ళీ పైకి కాపులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని జనసేన ప్రతినిధి విమర్శించారు.
బిజెపి జనసేన కూటమి మొదటి ఉమ్మడి హామీ?
ఒకరకంగా చూస్తే బిజెపి జనసేన కూటమి తమ మొదటి ఉమ్మడి హామీని ప్రకటించింది. జనసేన ప్రతినిధి చేసిన ఈ ప్రకటన ఏదో ఆషామాషీగా చేసింది కాదు అని, దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ ప్రకటన వెలువడింది అని, భవిష్యత్తులో కాపు రిజర్వేషన్ల అంశం మరింత చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించడం దీనికి బలం చేకూరుస్తోంది. త్వరలోనే కాపు రిజర్వేషన్ అంశం బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి హామీ గా ప్రజల ముందుకు రానుందని సమాచారం.
మహారాష్ట్ర లో మరాఠా లకు ఇదే తరహా రిజర్వేషన్లు కల్పించిన అనుభవం ఉన్న బిజెపి తో కలిసి జనసేన కాపు రిజర్వేషన్ సాధిస్తుందా అన్నది వేచి చూడాలి.