కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ కోసం కేంద్రానికి రాయాలని ఎపి శాసనసభ తీర్మానం చేయడం వెనక పెద్ద వ్యూహమే వుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి ప్రయోజనం ముద్రగడ పద్మనాభం శిబిరాన్ని నిరాయుధం చేయొచ్చు. ఎంతో కొంత ఇస్తామంటున్నారు గదా అన్న భావన వస్తే వారి ఆందోళన పదును తగ్గుతుంది. ముద్రగడ కూడా కొంతవరకూ సంతోషమేనని అనడమే అందుకు సంకేతం. మొదటి అడుగు పడిందనీ, భోజనం పెడతానని టిఫిన్ పెట్టారని కూడా వ్యాఖ్యానించారు. ఎంతో కొంత చేశారనే అర్థం ఈ మాటల్లో ధ్వనిస్తుంది.ఇక వైసీపీ నాయకుడు కాపు ప్రముఖుడు అంబటి రాంబాబు మంజునాథ కమిషన్ నివేదిక రాకుండా ఇవ్వడం వల్ల ఇది కోర్టులో నిలవదనే వాదనతో వ్యతిరేకత ప్రకటించారు. అయితే మెజార్టి సభ్యుల నివేదికలు వచ్చాయని వాదించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక మంజునాథ ఒక్కరే ఎందుకు ఇవ్వలేదు?అందరికీ న్యాయం జరిగేట్టు తన నివేదిక వుంటుందని ఆయన అనడంలో అర్థమేమిటి? బహుశా అగ్రవర్ణపేదలకు కూడా ఆయన రిజర్వేషన్ సిఫార్సు చేసి వుండొచ్చని రాజకీయ వర్గాలు వూహిస్తున్నాయి. ఆయన ఇచ్చాక ప్రభుత్వం దాన్ని కూడా అధ్యయనం చేస్తానని ప్రకటిస్తే ఇతర తరగతులకూ తాయిలం ఆశచూపినట్టు అవుతుంది. కాబట్టి రిజర్వేషన్ కథలో ఇంకా చాలా ట్విస్టులుంటాయి. బిసిలు కాపుల మధ్య పెద్ద ఘర్సణగా మారే అవకాశం మాత్రం వుండకపోవచ్చు. అలాటి ప్రయత్నాలు విఫలమైనాకే ప్రభుత్వం ఈ ప్రకటనచేసింది. ఈ క్రమంలో ఆర్.కృష్ణయ్యతో పాటు మరికొందరు బిసి నేతలు కూడా విమర్శలు మూటకట్టుకోవచ్చు. కృష్ణయ్య టిడిపినుంచి తప్కుకోవడానికి ఒక సాకు కావచ్చు.