ఒక ఎస్ ఐ ని కూడా ట్రాన్స్ ఫర్ చేయించలేని హోం మంత్రిగా పేరుపడిపోయినందువల్లో ఏమో నిమ్మకాయల చినరాజప్ప మీద కాపులకు కోపం ఏదీ లేదు. రాజప్పను అడ్డం పెట్టుకుని వ్యవహారం నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయిన బాబు కుమారుడు లోకేష్ మీదే వారి గురి వుంది. ఎంతో ఉత్సాహంతో జగన్ పార్టీ నుంచి స్వగృహ ప్రవేశమన్నట్టు తిరిగి తెలుగుదేశంలో చేరిన నిరంతర క్రియాశీలి జ్యోతుల నెహ్రూ ముఖ్యంగా గోదావరిజిల్లాల్లో కాపుల మూడ్ గమనించి మౌన వ్రతంలోకివెళ్ళిపోయాడు. అవసరమైతే జబ్బసత్తువ చూపించి అయినా సరే తాను అనుకున్న ”న్యాయం” చేయగల తోట త్రిమూర్తులు ఆచితూచి కూడా మాట్లాడటం మానేశారు.
కులంతో మొహమాటాలు పోకూడదు…పార్టీతో తేడా రాకూడదు అని తెలుగుదేశం కాపు నాయకులంతా తెరవెనక్కి పోతూండటాన్ని ఆ కులంలో పెద్దలు అర్ధం చేసుకుంటున్నారు. యువకులు ఆగ్రహంతో వున్నారు. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ రామభక్త హనుమాన్ అన్నట్టు చంద్రబాబుకే విధేయుడుగా వున్న రాజప్ప మీద ఆయన కులం లో పెద్దగా కోపంలేదు. ఆయన్ని వాడుకుంటున్న బాబుగారి మీదే కోపమంతా!
తునిలో రైళ్ళు తగలబెట్టిన వెంటనే ఇది రాయలసీమ వాళ్ళపని అంటూ జగన్ వైపు నేరాన్ని నెట్టడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించారు. అరెస్టులు కోనసీమలో మొదలైనప్పుడు ముఖ్యమంత్రి తెరమరుగైపోయారు. ఎంతటి వారైనా వదిలేది లేదని హోమంత్రి మైక్ అందుకున్నారు. అయితే ఇది చేసింది జగన్ మనుషులు కాదా అంటే తప్పుచేసిన వాళ్ళని వొదిలెయ్యాలంటారా అని రాజప్ప చికాకు పడటం మొదలైంది.
ముద్రగడను పరామర్శించడానికి రాష్ట్రం నలుమూలలనుంచీ రాకపోకలు సాగిస్తున్న కాపు పెద్దలు, కార్యకర్తలో ”పవర్ పార్టీలో వున్న కాపుల్లో మనవాళ్ళెవరు కానివాళ్ళెవరు అన్న టాపిక్ వచ్చినపుడల్లా ” హోమ్ మినిస్టర్ మంచోడు” అన్న మాటే వినబడుతున్నదంటున్నారు.
ఇతర కాపు ఎమ్మెల్యేలు ఎటూ చెప్పలేక మొహం చాటుచేస్తూండగా ఇబ్బంది కరమైన పరిస్ధితులలో కూడా విధేయతా స్వభావాన్ని మార్చుకోని నిమ్మకాయల చిన రాజప్ప గారు ఏమాత్రం భేషజం లేనివాడే! నిజంగా మంచివాడే!!