హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాపు సామాజికవర్గ నాయకుడు ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చారు. కాపులను కరివేపాకుల్లాగా వాడుకుంటున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కాపుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని, కాపులను బీసీలలో చేర్చుతామని ప్రకటించారని, దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకోలేదని విమర్శించారు. కాపులను వెంటనే బీసీలలో చేర్చాలని, వారికి రు.2 వేల కోట్ల నిధితో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రికి రెండుసార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందనా లేదని అన్నారు. కాపు జాతికి కోపం వస్తే చరిత్ర తిరగరాయటానికి వెనకాడరని చెప్పారు. కాపులను బీసీ జాబితాలో చేర్చకపోతే ఉద్యమాన్ని చేపట్టి ఉధృతం చేస్తానని ప్రకటించారు.
నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న ముద్రగడకు కాపులలో మంచి ఆదరణ ఉంది. గతంలోకూడా కాపులకు రిజర్వేషన్లకోసం ఉద్యమం చేశారు. తాజాగా పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీలో చేర్చాలంటూ హార్థిక్ పటేల్ చేపట్టిన ఉద్యమం స్ఫూర్తితో ఉద్యమానికి శ్రీకారం చూడుతున్నట్లు కనబడుతోంది.