పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని రీమేకులు తగ్గిపోయాయి. అగ్ర హీరోలు తమ సినిమాల్ని అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయడం ఎప్పుడైతే మొదలెట్టారో, అప్పుడే రీమేకుల అవసరం లేకుండా పోయింది. పైగా ఓటీటీలు ఓ సినిమాని అన్ని భాషల్లోనూ డబ్ చేసేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనూ కొన్ని కథలు రీమేకుల్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అలాంటి సినిమాల్లో ‘కిల్’ ఒకటి. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన ఈ చిత్రం అనూహ్యమైన విజయాన్ని అందుకొంది. ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైన ఈచిత్రానికి హిట్ టాక్ దక్కింది. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. ఇదో యాక్షన్ డ్రామా. కథంతా ట్రైన్లోనే నడుస్తుంది. హింస, రక్తపాతం ఎక్కువ. అయినా సరే, బాలీవుడ్ జనాలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని కరణ్ భావిస్తున్నాడు. అందులో భాగంగా ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాని తెలుగులో పునః నిర్మించే దిశగా అడుగులేస్తున్నాడు.
బడా హీరోలకు ఈ కథ సెట్ కాదు. విశ్వక్, సుధీర్‌బాబు లాంటి యువ హీరోలకైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. యాక్షన్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరోలెవరికైనా ఈ కథ సూట్ అవుతుందా, అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. దక్షిణాదికి చెందిన ఓ యువ దర్శకుడు ఈ సినిమాని టేకప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ‘కిల్‌ని’ ఉన్నది ఉన్నట్టు కట్, కాపీ, పేస్ట్ చేస్తే కుదరదు. తెలుగుకు తగినట్టుగా కొన్ని మార్పులు చేర్పులూ చేయాలి. రక్తపాతం, హింస తగ్గించాలి. అప్పుడే ఈ కథ వర్కవుట్ అవుతుంది. తెలుగులోనే కాదు, మిగిలిన దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు కరణ్. ఏక కాలంలో అన్ని భాషల్లోనూ ఒకేసారి చిత్రీకరణ పూర్తి చేసి, విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఒకొక్క భాషకూ ఒక్కో హీరో ఉంటాడా, లేదంటే హీరోలు మారతారా అనే విషయాలు తెలియాల్సివుంది.