బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ సరైన సినిమా లేదు. యేడాదికి దాదాపు 200 సినిమాల్ని నిర్మించే బాలీవుడ్ నుంచి ఈమధ్య ఒకట్రెండు విజయాలు సైతం కరువైపోతున్నాయి. ఇటీవల వచ్చిన ‘స్త్రీ 2’ మినహాయిస్తే, వసూళ్లు అందుకొని హిట్ అనిపించుకొన్న సినిమా ఏదీ లేదు. ఈ దెబ్బకు చాలా సంస్థలు కుదేలైపోయాయి. బడా బడా ప్రొడ్యూసర్లు సినిమాలకు దూరం అవుతున్నారు. తాజాగా కరణ్ జోహార్ సైతం తన ధర్మా ప్రొడక్షన్స్ లో 50 శాతం వాటా అమ్ముకోవాల్సివచ్చింది. ఇది.. బాలీవుడ్ పతనం అవుతోంది అనడానికి పెద్ద ఉదాహరణ.
బాలీవుడ్ లో జోరుగా సినిమాలు తీస్తూ, సౌత్ సినిమాల్ని అక్కడ డిస్టిబ్యూట్ చేసే పెద్ద నిర్మాణ సంస్థ.. ధర్మా ప్రొడక్షన్స్. అయితే ఈ సంస్థకు ఇటీవల వరుసగా ఫ్లాపులే తగిలాయి. ఎన్నో ఆశలు పెట్టుకొన్న ‘జిగ్రా’ కూడా దారుణంగా నిరాశ పరిచింది. ధర్మా ప్రొడక్షన్స్ నష్టాల్లో ఉందని, ఈ కంపెనీని కరణ్ త్వరలోనే మూసేస్తారని, లేదంటే ఈ సంస్థ అమ్మకానికి పెడతారని బాలీవుడ్ లో గట్టిగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే.. సంస్థలోని 50 శాతం వాటాని దాదాపుగా రూ.1000 కోట్లకు సెరెన్ ప్రొడక్షన్స్ సంస్థకు అమ్మేశారు. ఇక నుంచి ధర్మా ప్రొడక్షన్స్ కు సంబంధించిన క్రియేటీవ్ వర్క్ కరణ్ చూసుకొంటారని, ప్రొడక్షన్ మాత్రం సెరెన్ సంస్థ మేనేజ్ చేయబోతోందని తెలుస్తోంది. కరణ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ లో పేర్గాంచిన చాలా నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఇదే బాటలో ప్రయాణం చేయబోతున్నాయి. వరుసగా బడా హిట్లు పడితే తప్ప, బాలీవుడ్ తేరుకోవడం కష్టమే.