తెలుగుదేశంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు కరణం బలరాం. ఒంగోలు జిల్లాలో తిరుగులేని నేతగా ఉంటూ, పార్టీ అధిష్టానం దగ్గర మంచి పలుకుబడి ఉన్న నేతగా చెలామణి అయ్యారు. అయితే, ఆయన సొంత ఇలాఖాలో ప్రతిపక్ష పార్టీ వైకాపా నుంచి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి వచ్చారు. అక్కడి నుంచీ కరణం అలక మొదలైంది. జిల్లాలో సీనియర్ నేతగా తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రవికుమార్ ను చేర్చుకుంటున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, స్థానికంగా రవికుమార్, బలరాం వర్గాల మధ్య గొడవలు రచ్చకెక్కిన సందర్బాలూ చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటికి రెండుసార్లు జోక్యం చేసుకుని కరణాన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయనకి ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చారు.
బలరాంలో సొంత నియోజక వర్గం అద్దంకిలో స్థానాన్ని కోల్పోతున్నాననే అసంతృప్తి పెరుగుతూనే ఉంది. నిజానికి, వరుసగా రెండు ఎన్నికల్లోనూ.. అంటే, 2009, 2014లో బలరాం అక్కడ ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో రవికుమార్ కే అద్దంకి సీటు దక్కే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కరణం దృష్టిపెట్టినట్టు సమాచారం. ఓదశలో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారమూ జరిగింది. అయితే, పార్టీ మారేంత సాహసం ఆయన చెయ్యకపోవచ్చనీ.. మరో నియోజక వర్గం నుంచి తన సత్తా చాటే ప్రయత్నం చేయాలనే నిర్ణయానికి బలరాం వచ్చినట్టు సమాచారం. వాస్తవం మాట్లాడుకుంటే… గడచిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయిన నాయకుడికి ఏ పార్టీ అయినా పిలిచి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా..?
వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంగోలు నుంచి పోటీకి సిద్ధమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ అద్దంకి నుంచి ఆయనకి సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి, ఒంగోలులో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో ఒంగోలు ఎంపీగా కూడా బలరాం ప్రాతినిధ్యం వహించారు కాబట్టి, అక్కడ కూడా తన అనుచరగణం బాగానే ఉందంటున్నారు. అయితే, ప్రస్తుతం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న జనార్థన్ పరిస్థితి ఏంటనే సమస్య కూడా లేకపోవడం కరణానికి కలిసొచ్చే అంశంగా కనిస్తోంది. గత ఎన్నికల్లోనే జనార్థన్ ఒంగోలు నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపలేదు. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో ఆయన దామచర్ల నుంచి పోటీకి చూస్తున్నారనీ, దీంతో ఒంగోలు నుంచి కరణానికి అవకాశం కచ్చితంగా వస్తుందనే అంచనాలు ఆ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. అయితే, రవికుమార్ చేరిన తరువాత కరణం వర్గం పార్టీ తీరుపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా శాంతించని కరణం.. ఇప్పుడు ఒంగోలు ఎమ్మెల్యే సీటు కావాలంటే అధినాయకత్వం సానుకూలంగా స్పందిస్తుందా అనేదే ప్రశ్న..? ఒకవేళ ఆ ఆలోచన ఉంటే, ముందునుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాల్సింది.