చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కరణం బలరాం కుమారుడు వెంకటేష్ .. రెండు రోజుల్లో అన్ని తెలుస్తాయని చెబుతున్నారు కానీ.. ఖండించడం లేదు. అంటే.. కరణం బలరాం చాలా సీరియస్గా పార్టీ మార్పు గురించి ఆలోచిస్తున్నాడని.. అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల కిందట కూడా ఆయన పార్టీ మార్పుపై ప్రచారం జరిగింది. కానీ.. తనకు బండలు, ఇసుక వ్యాపారం లేదని.. తానెందుకు పార్టీ మారతానని.. బద్దశత్రువు.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని ఉద్దేశించి సెటైర్ వేసి.. ఊరుకున్నారు. అప్పట్లో ఆ ప్రచారం ఆగిపోయింది. ఇప్పుడు.. తాజాగా మరోసారి కరణం బలరాం.. పార్టీ మార్పు అంశం తెరపైకి వచ్చింది.
గొట్టిపాటి రవి టీడీపీలో చేరడం కరణం బలరాంకు ఇష్టం లేదు. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవి రావడంతో… కరణం కుటుంబానికి చాన్స్ దక్కలేదు. చివరి క్షణంలో ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారడంతో.. గత ఎన్నికల్లో చీరాల నుంచి చంద్రబాబు కరణం బలరాంను బరిలోకి దింపారు. దాంతో ఆయన విజయం సాధించారు. లేకపోతే.. ఆయనకు ఆ ఎన్నికల్లో చాన్స్ ఉండేది కాదు. అప్పుడే వైసీపీలో చేరి.. గొట్టిపాటి రవిపై ఆయన కుమారుడు వెంకటేష్ పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ చీరాల ఖరారు కావడంతో ఆగిపోయినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు గొట్టిపాటి రవిపై… అధికార పార్టీ తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. ఆయన క్వారీల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి.. వందల కోట్ల ఫైన్ వేసింది. అయినప్పటికీ.. గొట్టిపాటి రవి పార్టీ మార్పు సంకేతాలు ఇవ్వలేదు.
చివరికి.. కరణం బలరాం.. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం అయినా.. వైసీపీలో చేరాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. చీరాల నియోజకవర్గం కన్నా.. అద్దంకిలోనే తనకు ఎక్కువగా బలగం ఉందని.. తన కుమారుడు అక్కడ అయితేనే.. రాజకీయంగా నిలబడగలుగుతారని అంచనా వేసుకుంటున్నారు. గొట్టిపాటి రవి టీడీపీలో ఉన్నంత కాలం.. అద్దంకిలో కరణం వర్గానికి చాన్స్ దక్కే అవకాశం లేదు. అందుకే.. వైసీపీలో చేరాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. జగన్ బంధువు.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మేరకు.. చర్చలు జరిపి.. ఓకే చేయించారని అంటున్నారు. అదే జరిగితే.. టీడీపీ నుంచి మూడో ఎమ్మెల్యే జంప్ అయినట్లు అవుతుంది.