జగన్ పార్టీలో చేరి నిండా మునిగిపోయిన కరణం బలరాం వేరే దారి చూసుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ సమావేశాలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినా వెళ్లడం లేదు. కరణం బలరాంకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పైనే ఎక్కువ ఆందోళన ఉంది. తన పొలిటికల్ కెరీర్ ముగిసిపోతోంది కానీ కుమారుడ్ని ఓ దారికి తీసుకురాలేకపోతున్నారు .ఇక వైసీపీకి భవిష్యత్ ఉంటుందో ఉండదో.. ఉన్నా జగన్ రెడ్డి కి ఉన్న కుల వ్యతిరేకతతో ఎప్పుడు నట్టేట ముంచుతారోనన్న భయంతో ఆయన కుమారుడ్ని వేరే పార్టీల్లో చేర్చే ప్రయత్నంలో ఉన్నారు.
రెండు విధాలుగా కరణం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి తో చర్చలు జరిపి జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ సీనియర్ నేతలతోనూ ఆయన టచ్ లో ఉన్నారు. ఇటీవల ఓ ఫంక్షన్ లో ఎదురుపడినప్పుడు చంద్రబాబు పిలిచి మరీ పలకరించడంతో తనపై చంద్రబాబు తీవ్రమైన వ్యతిరేక భావంతో లేరని ఆయన అనుకుంటున్నారు. కానీ టీడీపీలోకి ఆయన కానీ ఆయన కుమారుడి ఎంట్రీ కానీ అంత తేలిక కాదు.
చీరాల నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు మరో నేత ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి చాలా ఓట్లను చీల్చడంతో కరణం ఓటమి ఖాయమయింది. కరణం వెంకటేష్ ఓ సారి అద్దంకి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చివరి క్షణంలో వచ్చిన అవకాశంతో చీరాల నుంచి ఆయన తండ్రి బలరాం గెలిచారు. 2024లో వైసీపీ నుంచి కరణం వెంకటేషే పోటీ చేశారు… కానీ ఓడిపోయారు. కుమారుడికి కాలం కలసి రాకపోవడం ఆయనను మనోవేదనకు గురి చేస్తోంది.