చీరాల నియోజకవర్గంలో కరణం బలరాం, ఆయన కుమారుడు పెద్దగా కనిపించడం లేదు. ప్రకాశం జిల్లాలో చాలా మంది అభ్య.ర్థుల పేర్లు మార్పు చేర్పుల్లో వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడూ కరణం పేరు కూడా వస్తోంది. కరణం వెంకటేష్ పేరు ఒంగోలు, పర్చూరు అంటూ రకరకాలుగా వినిపిస్తోంది. అయితే వారు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. క్యాంప్ ఆఫీస్ లోనే కాదు. చీరాలలోనూ పెద్దగా కనిపించడం లేదు. ఇదే ఆసక్తికరంగా మారింది.
చీరాలలో కరణం వెంకటేష్ తిరగడం లేదని.. ఆ నియోజకవర్గాన్ని తనకు ఇచ్చేయాలని ఆమంచి కృష్ణమోహన్ లాబీయింగ్ ప్రారంభించారు. తాడేపల్లిలో ప్రత్యక్షమయి… సజ్జలకు అప్లికేషన్ ఇచ్చుకున్నారు. అయితే ఇది ఆయన కావాలని ఇచ్చారా లేకపోతే.. సజ్జల ఆఫీస్ నుంచి అలాంటి సూచన వచ్చిందా అన్నది తెలియడం లేదు. కరణం వెంకటేష్ కు ఇటీవల ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన కాలుకు గాయం కావడంతో లేచి తిరిగే పరిస్థితుల్లో లేరు. కరణం వయోభారం కారణంగా రాజకీయాలు చేసే పరిస్థితిలో లేరు. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇప్పుడు ఇద్దరూ నియోజకవర్గంలో తిరగడం లేదు కాబట్టి తన నియోజకవర్గం తనకు ఇచ్చేయాలని ఆమంచి పట్టుబడుతున్నారు. లేకపోతే ఆయనకు జనసేన ఆప్షన్ ఉంది. ఎన్నికలకు ముందు ఎవరేం చేస్తారో చెప్పడం కష్టం. వైసీపీ గెలవదని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతూండటంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చాక.. చీరాల కోసం ఆమంచి ఎన్ని జంపింగ్‌లు అయినా చేసేందుకు రెడీగా ఉంటారని భావిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా వైసీపీ హైకమాండ్ ఆయనతో ఓ దరఖాస్తు పెట్టించుకుందని చెబుతున్నారు.