తెలంగాణ బీజేపీలో ఇప్పుడు అందిర కన్నా టాల్ లీడర్‌గా బండి సంజయ్ నిలబడ్డారు. దుబ్బాక ఉపఎన్నికతో పాటు… గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్పై పోరాడిన విధం ఆయనకు బీజేపీ శ్రేణుల్లోనే కొత్త క్రేజ్ తెచ్చి పెట్టింది. హైకమాండ్ వద్ద కూడా పలుకుబడి పెరిగింది. నేరుగా ప్రధానమంత్రి ఫోన్ చేసి… అభినందనలు కూడా తెలిపారు. తనకు వచ్చిన ఈ పొలిటికల్ ఇమేజ్‌తో తన స్థానబలాన్ని మరింతగా పెంచుకునేందుకు బండి సంజయ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ నుంచి చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. కరీంనగర్ టౌన్లో టీఆర్ఎస్ స్థానిక నేతగా గుర్తింపు ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన భార్య ఇప్పటికీ కార్పొరేటర్‌గా ఉన్నారు.
మరికొంత మంది టీఆర్ఎస్ నేతలను కూడా… బండి సంజయ్ బీజేపీ వైపు ఆకర్షిస్తున్నారు. బండి సంజయ్.. బీజేపీలో దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ.. బలమైన నేతగా ఎదగలేకపోయారు. ఎన్ని సార్లు పోటీ చేసినా ఓడిపోతూ వస్తున్నారు. కానీ కరీంనగర్లో ఉన్న ముస్లిం జనాభా… పోటీగా ఆరెస్సెస్ బలం కలిపి ఆయన నియోజకవర్గ స్థాయిలో బలమైన నేతగా మారారు. కానీ గెలిచేంత కాదు. ఎంఐఎం టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి.. టీఆర్ఎస్ సులువుగానే గట్టెక్కుతుంది. ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్‌తో .. తన స్థానంలో బీజేపీని బలోపేతం చేసుకుంటే.. బలమైన నేతగా తనకు మరింత పట్టు దొరుకుతుందని బండి సంజయ్ భావిస్తున్నారు.
కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన బండి సంజయ్… అది అనూహ్యం కాదని.. నిరూపించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన కరీంనగర్లో బీజేపీకి పట్టు పెరిగేలా చేయగలిగితే… బీజేపీలో ఆయనకు తిరుగులేని స్థానం దక్కడం ఖాయమే. అంతా గెలిచి… ఆయన స్వస్థలంలో బీజేపీని గెలిపించకపోతే.. ఇబ్బందికరం అవుతుంది. అందుకే బండి సంజయ్.. టీఆర్ఎస్ మీద గట్టిగానే గురి పెట్టారు.