భారతీయ జనతా పార్టీ.. తెలంగాణలో గొప్ప ప్రతాపం చూపిస్తామని… బయటకు ప్రకటనలు చేస్తోంది కానీ… మొత్తంగా చూస్తే.. ఓ పదిహేను సీట్లపై మాత్రం దృష్టి పెట్టిందట. అందులో ఒకటి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడి నుంచి అభ్యర్థిగా తొలి జాబితాలోనే బండి సంజయ్ ను ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం.. అమిత్ షా కరీంనగర్లో సభ నిర్వహించారు. బండి సంజయ్ భారీగా జన సమీకరణ చేయడమే కాదు… ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు సవాళ్లు విసురుతున్నారు. దీంతో అంతో ఇంతో అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో కరీంనగర్ ను కూడా చేర్చుకుని కార్యచరణ ప్రారంభించారు. కర్ణాటకకు చెందిన ఓ బృందాన్ని బీజేపీ నేతలు ప్రత్యేకంగా కరీంనగర్‌కు పంపారట. కర్నాటక ఎన్నికల్లో ఓటర్లను మచ్చిక చేసుకున్న తీరు.. ఆ వ్యూహాన్ని కరీంనగర్లో అమలుు చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారం చేసేందుకు కర్నాటక నుంచి దాదాపుగా వంద మందితో కూడిన బీజేపీ బృందం కరీంనగర్ వచ్చింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి పది మందికి తగ్గకుండా నియమించారు. ఈ బృందం వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో కార్యకర్తలకు పూర్తి సమయం కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విసృతంగా ప్రచారం చేస్తారు. పైకి ఇది కనిపించేదే కానీ.. అంతర్గత ఎన్నికల వ్యూహం మాత్రం వేరే ఉంటుంది. వీళ్లు ప్రచారం వ్యూహాలతో రంగంలోకి దిగినప్పటి నుంచి కరీంనగర్ లో పరిస్థితులు మారుతున్నాయి. ముస్లిం జనాభా గణనీయంగా ఉండటంతో.. బండి సంజయ్ మతపరమైన అంశాలనే.. ెక్కువగా లేవనెత్తుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ… ఎంఐఎం కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆరెస్సెస్ రామ రాజ్యం కోరుకుంటే ఎంఐఎం ఉగ్రరాజ్యం కోరుకుంటుందని ప్రచారం చేస్తున్నారు. రామ రాజ్యం కావాలో ఉగ్ర రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని హిందూ వర్సెస్ ముస్లిం పరిస్థితి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
బండి సంజయ్ తీరుతో.. గంగుల కమలాకర్‌కు టెన్షన్ ప్రారంభమయింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు పోలరైజ్ అవుతాయేమోన్న భయంతో.. బండి సంజయ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. దాంతో ఓ కేసు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. కానీ బండి సంజయ్ మాత్రం.. ప్రచార కర్తల వ్యూహాలకు అనుగుణంగా.. ప్రకటనలు చేస్తూ… ముందుకెళ్తున్నారు. మొత్తానికి కరీంనగర్ లో… బండి సంజయ్ బీజేపీకి ఆశలు రేపుతున్నారనే చెప్పాలి.