తెలంగాణ రాష్ట్ర సమితికి బాగా పట్టు ఉన్న జిల్లాల్లో కరీంనగర్ ముందు ఉంటుంది. ఈసారి ఈ జిల్లాలో టిక్కెట్ల కోసం అధిక పోటీ ఉండటంతో.. సహజంగానే అసంతృప్తుల సెగ ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. చొప్పదండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే శోభకు టికెట్ పెండింగ్‌లో పెట్టారు. ఆమె కి ఇవ్వొద్దని ఓ వర్గం…. ఇవ్వాల్సిందేనని మరో వర్గం ప్రదర్శనలు ప్రారంభించింది. మానకొండూరులోనూ దాదాపు అదే పరిస్థితి. వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి.
మానకొండూరు నియోజకవర్గంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. రసమయి బాలకిషన్ కు టికెట్ క్యాన్సిల్ చేయాలనే ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానికుడైన ఓరుగంటి ఆనంద్ కు టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. నియోజకవర్గంలో రసమయిపై తీవ్ర వ్యతిరేకత ఉందని…ఆయన ఎక్కడికెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. శంకరపట్నం , బెజ్జంకి మండలాల్లో పర్యటించిన రసమయికి స్థానికులు షాక్ ఇచ్చారు. అభివృద్ధి పనులపై నిలదీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేములవాడలోనూ ఇదే పరిస్థితి. ఇటీవల స్థానిక సంస్థల్లో మొదలైన వివాదం ముదిరిపాకాన పడింది. వేములవాడ మున్సిపాలిటీలో అవిశ్వాసానికి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వర్గీయులు తెరలేపారు. అయితే ఆయన వ్యతిరేక వర్గీయులు ఈ అవిశ్వాసంలో పట్టునిలుపుకున్నారు. అప్పటి నుంచి రమేశ్ కు వ్యతిరేంగా ఓవర్గం బలంగా పనిచేస్తోంది. ఆవర్గం నేతలు ఏకంగా రమేశ్ ను ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. వేములవాడలో అసమ్మతి వర్గం ఇప్పటికే భారీ సమావేశాలను నిర్వహిస్తోంది. మేడిపల్లి నుంచి కథలాపూర్ మీదగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జడ్పీచైర్ పర్సన్ తుల ఉమ వేములవాడ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇక కరీంనగర్ నియోజకవర్గం నుంచి.. గంగుల కమలాకర్‌కు మళ్లీ టిక్కెట్ ఇచ్చారు. ఈయనకు పెద్దగా అసమ్మతి లేదు కానీ… పోటీగా.. కొత్తగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ కి వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పార్లమెంట్ కి వెళ్లాలనుకున్న పొన్నం.. అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సింపతీ రెట్టింపవుతుందని.. అది ఓట్లు తెచ్చి పెడుతుందని.. అంచనా వేసుకుంటున్నారు.