ఎమ్మెల్యేలు ఎక్కువ సేపు సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడి స్పీకర్ కొత్త మార్గాన్ని అన్వేషించారు. లంచ్ అవగానే కాసేపు కునుకు తీసేందుకు ఎమ్మెల్యేలకు రిక్లైనర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు కాసేపు వచ్చి ఇక అలసిపోయామని వెళ్లిపోతున్నారు. లంచ్ తర్వాత అయితే సమావేశాల్లో సగం మంది ఉండటం లేదు. సమస్య ఏమిటా అని ఆరా తీస్తే తిన్న తర్వాత కాసేపు నిద్రపోవాలని చెప్పారట. అందుకే వారందర్నీ అసెంబ్లీలో ఉంచడానికి రిక్లైనర్లు ఏర్పాటు చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఈ రిక్లైనర్ల ఏర్పాటు గురించి ప్రకటించగానే సహజంగానే చర్చ ప్రారంభమయింది. అసెంబ్లీకి నిద్రపోవడానికి వెళ్తారా అని ఇతర పార్టీలు ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఇలాంటి ఏర్పాట్లు ఉంటున్నాయి. ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీల కార్యాలయాలకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో ఉన్నలగ్జరీ ఆఫీసుల్లో ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవడానికి.. ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. అలసిపోకుండా.. మైండ్ ను ఫ్రెష్ గా ఉంచుకోవడానికి ఈ ఏర్పాట్లు చేసుకుంటారు. అదే పద్దతిని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు.
ఆయన ప్రయత్నం ఫలించి ఎమ్మెల్యేల హాజరు పెరిగితే… నిజంగా మంచి ఐడియానే అనుకోవచ్చు. ఈ రోజుల్లో చట్టసభలకు ఎమ్మెల్యేలు, పార్టీలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్య బలం చట్టసభల్లోనే ఉందని గుర్తించేందుకు సిద్దపడటం లేదు. ఇలాంటి ప్రయత్నాలతో అయినా వారిని సభ వరకూ తీసుకురాగలిగితే.. ప్రజాస్వామ్య దేవాలయానికి కాస్త కళ వస్తుంది.