కర్ణాటకలో మూడు పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్క చోట మినహా మిగిలిన నాలుగు చోట్ల కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ సిట్టింగ్ స్థానం అయిన… బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ లక్షన్నర ఓట్లకుపైగా మెజార్టీతో ఆధిక్యత ప్రదర్శించడం.. సంచనలం సృష్టిస్తోంది. దశాబ్దాలుగా… బళ్లారిని గుప్పిట్లో పెట్టుకున్న గాలి జనార్దన్ రెడ్డి వర్దం ఈ సారి కూడా.. తమ పట్టు నిరూపించుకుని.. కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ వేవ్ ఉందని నిరూపించే ప్రయత్నం చేసి.. బోర్లా పడ్డారు. గాలి జనార్ధన్ రెడ్డి అనుంగు అనుచరుడు బి.శ్రీరాములు సోదరి శాంతను.. బళ్లారిలో అభ్యర్థిగా నిలిపారు. బి.శ్రీరాములు.. ఆరు నెలల పదవి కాలం అయినా సరే.. తీవ్ర స్థాయిలో విజయం కోసం ప్రయత్నించారు. సాధారణ ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లుగా.. నోట్ల ప్రవాహం పారించారు. కానీ ఏ మాత్రం… కాలం కలసి రాలేదు. బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్పకు… భారీ విజయం వరించింది. దీంతో బళ్లారిలో… గాలి బ్రదర్స్ హయాంలో అంతమైనట్లేనని అనుకోవచ్చు.
ఇక బీజేపీ ఆశలు పెట్టుకున్న మరో అసెంబ్లీ స్థానం జమాఖండి. గత ఎన్నికల్లో.. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్తి సిద్ధు న్యామగౌడ కేవలం మూడు వేల ఓట్ల ఆధిక్యతతో బీజేపీపై గెలిచారు. అయితే అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో.. ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని గెల్చుకుంటే.. రాజకీయ పరిస్థితులు మారిపోతాయని.. బీజేపీ నేత యడ్యూరప్ప ఆశపడ్డారు. జమాఖండిలోనే మకాం వేసి… ఎన్నికను పర్యవేక్షించారు. కానీ…. అనువైన ఫలితం రాలేదు. కానీ మెజార్టీ మాత్రం దాదాపుగా 40వేలకు పెరిగిపోయింది. ఇక మరో అసెంబ్లీ స్థానం రామనగరలో బీజేపీ ముందే చేతులెత్తేసింది. ఆ పార్టీ అభ్యర్థి పోలింగ్‌కు రెండు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అక్కడ్నుంచి.. సీఎం కుమారస్వామి సతీమణి.. అనితా కుమారస్వామి దాదాపుగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కుమారస్వామి రెండు స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రామనగరకు రాజీనామా చేశారు. ఇప్పుడా స్థానం నుంచి ఆయన సతీమణి విజయం సాధించారు.
ఇక మాండ్యా లోక్‌సభ నియోజకవర్గంలో… జేడీఎస్ అభ్యర్థికి తిరుగులేకుండా పోయింది. నిజానికి అక్కడ.. కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. బీజేపీకి అక్కడ బలం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ కలిపి.. జేడీఎస్ అభ్యర్థిని నిలబెట్టాయి. దాంతో ఆ స్థానంలో బీజేపీ ఆశలు పెట్టుకోలేదు. ఓట్లు పెరుగుతాయని ఆశ పడింది. కానీ అదీ జరగలేదు. ఇక బీజేపీకి.. ఊరటనిచ్చిన ఒకే ఒక్క స్థానం శివమొగ్గ లోక్‌సభ స్థానం. ఈ స్థానం నుంచి గతంలో యడ్యూరప్ప ఎంపీగా ఉండేవారు. ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో ఆయన కుమారుడు రాఘవేంద్రను.. అభ్యర్థిగా నిలబెట్టారు. గత లోక్ సభ ఎన్నికల్లో మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీ సాధించిన యడ్యూరప్ప ఈ సారి కుమారుడికి… యాభై వేల ఓట్ల మెజార్టీ కూడా సంపాదించి పెట్టలేకపోయారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తే.. బీజేపీకి కర్ణాటకలో గడ్డు పరిస్థితి ఎదురవడం ఖాయంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.