కాంగ్రెస్ పార్టీకిది కష్టకాలం. దీని నుంచి బయటపడటానికి ఎంతో ప్రయత్నిస్తోంది. కానీ సాధ్యం కావడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దయింది. రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మరోవైపు, త్వరలోనే ఇంకో ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయనే, సిద్ధరామయ్య
మొదటి నుంచీ వివాదాస్పదంగా, అత్యంత వివాదాస్పదుడిగా ఆయన ముద్రపడ్డారు. ఆయన ప్రభుత్వం పనితీరు కంటే తీసుకున్న కొన్ని నిర్ణయాలే పెద్ద మైనస్ పాయింట్ అనే భావనతో కాంగ్రెస్ హైకమాంట్ ఉందట. ముఖ్యంగా ఇటీవల తన సుపుత్రుడికి భారీ కాంట్రాక్టును కట్టబెట్టడం ద్వారా సిద్ధూ పెను వివాదంలో చిక్కుకున్నారు. ఇలాగైతే పార్టీ మరోసారి గెలవడం కష్టమని చాలా మంది సీనియర్లు హైకమాండ్ కు మొరపెట్టుకున్నారు.
ఒకప్పుడు దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన జరిగేది. ఇప్పుడు కేవలం 7 రాష్ట్రాలకే కాంగ్రెస్ అధికారం పరిమితమైంది. అందులో నాలుగు ఈశాన్య రాష్ట్రాలు. ఉన్నంతలో కర్ణాటకే పెద్ద రాష్ట్రం. అక్కడ 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండేళ్లలో పార్టీ, ప్రభుత్వ ఇమేజిని పెంచుకోకపోతే ఇంతే సంగతులని పలువురు సీనియర్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు బ్రీఫింగ్ ఇచ్చారట.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న కేరళ, అస్సాంలలో గనక కాంగ్రెస్ ఓడిపోతే, అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఐదుకు పడిపోతుంది. కేరళలో కాంగ్రెస్ ఓటమి తప్పకపోవచ్చని సర్వేలు సూచించాయి. అస్సాంలోనూ బీజేపీ కూటమిదే పైచేయి కావచ్చని అంచనా వేశాయి. ఇక కర్ణాటకను కూడా చేజార్చుకుంటే కాంగ్రెస్ ఓ ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరవచ్చు. అదే హైకమాండ్ భయం. కాబట్టి త్వరలోనే సిద్ధరామయ్యకు బదులు మరొక సీఎంను సీట్లో కూర్చోబెట్టవచ్చని సమాచారం. అందుకు సమర్థుడి కోసం అన్వేషణ మొదలైందట.
తనను ముఖ్యమంత్రిని చేస్తే వచ్చేరెండేళ్లలో పార్టీకి పునరుత్తేజం తెస్తానని మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ హైకమాండ్ కు చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన వయసు 83 ఏళ్లు. కాబట్టి యువతరం నుంచే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని సోనియా, రాహుల్ భావిస్తున్నారు. ప్రస్తుత మంత్రి, దళిత నాయకుడు పరమేశ్వరక అవకాశం దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివాదాలకు అతీతుడు కాబట్టి ఆయనే మేలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీకి చెక్ పెట్టి, మరోసారి గెలవడానికి ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకపై ఫోకస్ పెట్టడం విశేషం.