డైలీ సీరియల్ మాదిరిగా కర్ణాటక రాజకీయాల్లో అనిశ్చిత వాతావరణం కొనసాగుతూనే ఉంది. జేడీఎస్, కాంగ్రెస్ ల మధ్య సయోధ్య సమస్యగానే కనిపిస్తోంది. మంత్రి పదవులు రానివాళ్లు గొడవలు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు పరిస్థితి కొంత అదుపులోకి రావాలంటే ముఖ్యమంత్రి కుమారస్వామి దగ్గరున్న 11 శాఖలకూ మంత్రుల్ని నియమించాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ, అది అంత సులువుగా జరిగేట్టూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హెచ్ కె పాటిల్ ఇంట్లో దాదాపు 20 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు సమాచారమైనట్టు సమాచారం. వీరిలో చాలామంది గత క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసినవారున్నారు. దీంతో వీరికి రెండోసారి పదవులు దక్కకకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురౌతున్నారు. గత ప్రభుత్వంలో తాము బాగానే పనిచేశామనీ, ఇప్పుడు తమకు ఎందుకు అవకాశం ఇవ్వరంటూ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉండటం గమనార్హం.
అంటే, రెబెల్స్ గా మారే అవకాశం కూడా ఉంది. పరిస్థితి ఆ స్థాయి వరకూ వెళ్లకుండా ఉండేందుకు ఈ అసంతృప్త నేతలతో ముఖ్యమంత్రి కుమారస్వామి శనివారం సమావేశమయ్యారు. పాటిల్ ఇంటికి వెళ్లి, అక్కడ సమావేశమైన నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ సమయంలో కర్ణాటక రాజకీయాల్లో స్థిరత్వం రావాలంటే.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానమే జోక్యం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే, రాష్ట్రంలో గత కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పనిచేసినవారితోనే కదా ఇప్పుడు గొడవంతా. వారి విషయంలో కాంగ్రెస్ జోక్యం చేసుకుని, వారికి కొంత నచ్చజెప్తే పరిస్థితి అందుపులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంకోపక్క, మరో పదిమంది దొరికితే చాలు… ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే అవకాశం కోసం భాజపా కాచుకుని కూర్చున్న సంగతీ తెలిసిందే. కాబట్టి, ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఓ పదిమంది గోడ దూకితే, ఆ పరిస్థితిని భాజపా అద్భుతంగా వినియోగించుకుంటుంది అనడంలో సందేహం లేదు. సో.. కాంగ్రెస్ అధిష్టానం జోక్యమే ఇప్పుడు అత్యవసరం. అసంతృప్తితో ఉన్న నేతలకు వేరే పదవులు ఇస్తామనో, లేదా ఇతర అవకాశాలు ఏవైనా కల్పిస్తామనో హైకమాండ్ భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి, కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.