కాంగ్రెస్ పార్టీ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. గోవా, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ… ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో విఫలమయింది. దీనికి కారణం.. కాంగ్రెస్ నిర్లిప్తత.. బీజేపీ చురుకుదనం. చిన్న రాష్ట్రాలయినా… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తేలిగ్గా తీసుకోలేదు. ఎమ్మెల్యేలను నయానో..భయానో తమ వైపు తిప్పుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కర్ణాటకలోనూ… ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు కానీ… అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందని నమ్మకం ఉండటంతో… ఈ సారి మాత్రం బీజేపీకి స్కోప్ ఇవ్వకూడదని కాంగ్రెస్ డిసైడయింది. అందుకే ఆ పార్టీ అగ్రనేతలు.. గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ బెంగళూరులో మకాం వేశారు.
హంగ్ అంటూ వస్తే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఓ టాస్క్ అయితే… ఇతర పార్టీల మద్దతు, స్వతంత్రుల కరుణ సాధించడం మీదనే ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం చేజారకుండా… ఈ సారి ముందు నుంచీ పక్కా స్కెచ్ వేస్తున్నారు. జేడీఎస్ మద్దతు అవసరం అయితే… సీఎంగా తప్పుకోవడానికి సిద్ధమని… సిద్ధరామయ్య ప్రకటించడం దీనిలో భాగమే. తమకు లోటులో పడే.. ఎమ్మెల్యేల మద్దతు కోసం… స్వంతంగా ప్రయత్నించేందుకు.. గులాం నబీ ఆజాద్, గెహ్లాట్లను కాంగ్రెస్ హైకమాండ్ పంపింది. బీజేపీ ఇప్పటికే… పది సీట్లలోపు తగ్గితే.. ఆపరేషన్ లోటస్‌ను చేపట్టాలని డిసైజయింది. దాని కోసం.. గాలి జనార్ధన్ రెడ్డి అండ్ కోలను వాడుకోనున్నారు. వీరు ప్రధానంగా జేడీఎస్ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.
కర్ణాటకలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనేదానిపై… దేశ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. కాంగ్రెస్ ఈ విషయంలో ముందంజ వేస్తే… వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ.. అదే జోరు కొనసాగించే అవకాశం ఉంది. కానీ బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తే.. మాత్రం… మోదీ హవా తగ్గనట్లే. కానీ రెండూ ఉండే పరిస్థితులు లేవు కాబట్టే.. ఇప్పుడు… హంగ్ నుంచి కింగ్‌ను ఎంపిక చేసేందుకు జేడీఎస్ సిద్ధమవుతోందని అంటున్నారు.