అధికారం దక్కించుకోవడం కోసం భాజపా ఏ స్థాయి రాజకీయాలు చేస్తుందో అరుణాచల్ ప్రదేశ్ మొదలుకొని చాలా రాష్ట్రాల్లో చూశాం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా దాదాపు అలాంటి ఎత్తుగడతో అధికారం చేపట్టాలని ప్రయత్నించారు. కానీ, భాజపా వ్యూహం బయటకి పొక్కేయడంతో… పరువు పోతుందనీ, త్వరలో లోక్ సభ ఎన్నికలున్నాయన్న ఉద్దేశంతో ఆ దశలో వెనక్కి తగ్గారన్నది వాస్తవం! అయితే, ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కర్ణాటకలో మరోసారి క్యాంపు రాజకీయాలు షురూ అయ్యే అవకాశం కనిసిస్తోంది. దానికి కారణం ఆ రాష్ట్ర భాజపా నేత ఎడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలే..!
ఈనెల 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి, భాజపా నాయకులందరూ బెంగళూరులోనే ఉండాలంటూ ఎడ్యూరప్ప ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు భాజపాకి అనుకూలంగా ఉండబోతున్నాయనీ, 280 ఎంపీ స్థానాలు దక్కించుకుని మరోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య సరైన అవగాహన కుదరకపోవడంతో భాజపాకి కలిసి వచ్చిందనీ, ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉందనీ, రాష్ట్రంలో దాదాపు 22 ఎంపీ సీట్లలో గెలవబోతున్నామన్నారు. అంతేకాదు, ఇప్పటికే తమతో దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయం అవుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుందనీ, దానిలో తమ ప్రమేయం కూడా ఏమీ ఉండదనీ, అప్పటి పరిస్థితులు అలా మారతాయంటూ ఎడ్యూరప్ప అభిప్రాయపడ్డారు!
దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అవుతున్నట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికైనా తరలిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కొంత ఆలోచనలో పడ్డారని సమాచారం. అంతేకాదు, సొంత ప్రభుత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలపై ఆయన ఓ కన్నేసి ఉంచారనీ, ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందుకు రోజున ఏదో ఒక ప్రాంతానికి వారిని తరలించే అవకాశం ఉందని కన్నడనాట వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ మరోసారి ఎడ్యూరప్ప మైండ్ గేమ్ ప్రారంభించారని అనుకోవచ్చు. ఏదేమైనా, 23 తరువాత కర్ణాటకలో ఏదో జరుగుతుందనే చర్చ మళ్లీ తెరమీదికి వచ్చింది.