కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకోవడం… సంచలనం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం.. కర్ణాటక శాసనమండలిలో… చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టారు. చైర్మన్‌పై అవిశ్వాసంపై చర్చలో చైర్మన్ ఉండటం భావ్యం కాదు కాబట్టి..ఆ స్థానంలో డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ కూర్చున్నారు. ఆయనే చర్చను చేపట్టారు. అయితే.. తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు ఆయనను ఆ సీటు నుంచి దింపేసి.. కాంగ్రెస్ ఎమ్మెల్సీని కూర్చోబెట్టారు. ఈ ఘటన సంచలనాత్మకం అయింది. దీంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన ధర్మేగౌడ… అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో నుంచి ఒంటరిగా వెళ్లిపోయారు. చిక్మగుళూరు ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కన విగత జీవిగా పడి ఉన్నారు.
ధర్మేగౌడ.. జేడీఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న సమయంలో… ఆయన కాంగ్రెస్ మద్దతుతో మండలి వైస్ చైర్మన్ అయ్యారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఆయనను దించేశారు. మామూలుగా చట్టసభల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూంటాయి. వాటి ద్వారా… ఎదుటి పార్టీల అప్రజాస్వామిక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూంటాయి. అంతే కానీ.. వ్యక్తిగతంగా తీసుకోలేరు. అలా తీసుకుంటే రాజకీయాల్లో ఉండటం కష్టం. కానీ.. ధర్మేగౌడ సున్నిత మనస్థత్వం కలిగిన రాజకీయ నేతగా కనిపిస్తున్నారు. తనకు అవమానం జరిగిందని పీలవడంతో.. ఆయన ప్రాణం తీసుకోవడానికి కూడా వెనుకాడలేదని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా.. రాజధాని బిల్లుల సందర్భంగా శాసనమండలిలో అలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. మండలి చైర్మన్ షరీఫ్ పై.. వైసీపీ నేతలు చేసిన దాడి అంతా ఇంతా కాదు. ఆయన మతంపై కూడా విమర్శలు చేశారు. ఇంటా బయటా అనేక రకాలుగా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. అయితే ఆయన చాలా ఉన్నతంగా స్పందించారు. అవన్నీ.. రాజకీయాల్లో భాగమని.. సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పేశారు. కానీ.., ధర్మేగౌడ మాత్రం… వ్యక్తిగతంగా తీసుకుని.. రాజకీయాలకు బలైపోయారు.