కర్ణాటక పోలీసులు తెలుగు సినీ నటుడు తనీష్‌కు.. నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హాజరు కాకపోతే.. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి అరెస్ట్ చేసి పట్టుకెళ్లే అవకాశం ఉంది. ఒక్క తనీష్కు్ మాత్రమే కాదు.. మరో నలుగురు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ డ్రగ్స్ కేసు… ఇక్కడిది కాదు. కర్ణాటకది. కర్ణాటకలో బయటపడిన డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతూండగా.. లింకులు.. టాలీవుడ్‌కు దారితీశాయి. ఈ క్రమంలో తనీష్ పేరు బయటకు రావడంతో ముందుగా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరు డ్రగ్స్ కేసులో… హీరోయిన్లు సంజన , రాగణిలను అరెస్ట్ చేసి చాలా కాలం జైల్లో ఉంచారు.
ఆ కేసు విచారణ తీగలాగుతూంటే.. అనేక లింకులు బయట పడుతున్నట్లుగా కనిపిస్తోంది. సినీ జగత్తులో మత్తు వ్యాపారం అంతా.. వ్యవస్థీకృతంగా ఉంటుందని… సినీ పరిశ్రమలు వేరైనా.. ఈ డ్రగ్స్ బిజినెస్ మాత్రం… ఒకే రీతిన ఉంటుందని.. ఒకరికి ఒకరికి లింకులు ఉంటాయన్న ప్రచారం ఉంది. అది ఇప్పుడు.. కర్ణాటక పోలీసులు వెలికి తీసే అవకాశం కనిపిస్తోంది. గతంలో హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్‌లోనూ తనీష్ పేరు ప్రచారం జరిగింది. ఆయనకూ నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. ఇప్పుడు కర్ణాటక పోలీసుల రాడార్లోకి కూడా తనీష్ వెళ్లాడు. తనీష్‌ను విచారించిన తర్వాత మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖులకు… కర్ణాటక పోలీసులు నోటీసులుజారీ చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి హైదరాబాద్ పోలీసులు.. డ్రగ్స్ కేసు విషయంలో అంతని.. ఇంతని హడావుడి చేసి.. చివరికి కేసును పక్కన పడేశారు. ఇక్కడ పోలీసులకు పొలిటికల్ ఒత్తిడి ఎదుర్కొనిఉంటారు. కానీ కర్ణాటక పోలీసులకు అలాంటి ఒత్తిళ్లేమీ ఉండవు. ఉంటే గింటే.. కర్ణాటక స్టార్ల జోలికి వెళ్లకుండా చూస్తారేమో.. కానీ ఆధారాలుంటే.. టాలీవుడ్ స్టార్ల సంగతి చూడకుండా ఉండరని అంటున్నారు. మొత్తానికి డ్రగ్స్ కేసు.. కర్ణాటక వైపు నుంచి టాలీవుడ్‌ను చుట్టు ముట్టే అవకాశం కనిపిస్తోంది.