కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం అనే సమీకరణమే కాదు … కర్ణాటక తరహాలో కాంగ్రెస్, బీజేపీ కూడా అధికారం కోసం పోరాడుతున్నాయి. రాజకీయాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు దాని పక్క రాష్ట్రంలో పడటం సర్వసాధారణం. తెలంగాణలో కాంగ్రెస్ మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వారికి నైతిక ధైర్యం కావాలి. ఆ ధైర్యం కర్ణాటక ప్రజలు ఇస్తారని నమ్ముతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ నేతలు సంబరాలు చేసుకోవడం ఖాయం. సరిహద్దు ప్రాంతాల్లో ఆ ప్రభావం నేరుగా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా గెలిచే పార్టీ కాంగ్రెస్ అన్న భావన వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు కర్ణాటకలో గెలవడానికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని అక్కడి నేతలకు చెబుతున్నారు. ప్రచారానికి వెళ్తున్నారు. పాదయాత్రను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి కూడా తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో ముందు నుంచీ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
దక్షిణాదిన ఎదగాలనుకుంటున్న బీజేపీ కాలం కలసి రావడం లేదు. బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరు ఉంది. దీనికి కారణం దక్షిణాదిన ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోవడమే. అతి కష్టం మీద కర్ణాటకలో మాత్రం రెండు మూడు సార్లు అధికారం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఆ పార్టీ ఎదురీదుతోంది. కర్ణాటకలో బీజేపీ స్వతహాగా విజయం సాధించలేదు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కుమార స్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చారు. అదే బీజేపీకి మైనస్ అవుతోంది. అయినా అధికారం సాధిస్తామని నమ్ముతున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లను కీలకంగా భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కూడా తెలుగు ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని అక్కడ రాజకీయాలు చేయబోతోందని అనుకున్నారు. కేసీఆర్ కూడా అదే ప్రకటించారు. కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. చివరి క్షణంలో జేడీఎస్‌కు మద్దతు పలికే అవకాశం ఉందేమో కానీ పోటీ చేసే చాన్స్ లేదు. ఒక వేళ బీఆర్ఎస్ సపోర్ట్ చేసి జేడీఎస్ కింగ్ మేకర్ అయితే.. భారత రాష్ట్ర సమితికి అడ్వాంటేజ్ లభించవచ్చు. అందుకే కర్ణాటకలో తమ పార్టీ గెలుపు కోసం …బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు బయలుదేరుతున్నారు.