కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎదురు లేని విజయాలతో సాగుతున్న బీజేపీ, సాధారణ ఎన్నికల ముందు తమ చేవ చచ్చిపోలేదని నిరూపించడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణాదిలో రెండు జాతీయ పార్టీలు..హోరాహోరీ తలపడుతున్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక. మరే రాష్ట్రంలోనూ బీజేపీకి పెద్దగా పట్టులేదు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా.. అక్కడ బీజేపీ లేదు. దీంతో కర్ణాటక ఎన్నికల ఫైట్ లో గెలుపోటములు… వారి ఫేట్ ను.. సాధారణ ఎన్నికల్లో కూడా నిర్ణయించనున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మఖ్యమంత్రిగా ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. ఇక్కడ కూడా అధికారం కోల్పోతే… బీజేపీ… పూర్తిగా కాషాయం అయిన ఇండియా మ్యాప్ ను… కొత్తగా ఆవిష్కరిస్తుంది. అందుకే కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. నిజానికి మూడు నెలల వరకు..కాంగ్రెస్ కు పాజిటివ్ వేవ్ ఉందని పెద్దగా ఎవరూ అనుకోలేదు. సిద్ధరామయ్య…గొప్ప పాలన ఏమీ అందించలేదు. కానీ వివాదాలకు మాత్రం కొదవ లేదు. కానీ కర్ణాటకలో కావాల్సింది.. కుల, మత సమీకరణలే. ఈ విషయంలో మాత్రం సిద్ధరామయ్య .. బీజేపీని మించి పోయారు. ఉప ప్రాంతీయ వాదంతో.. ప్రత్యేక జెండాను రూపొందించారు. లింగాయత్ లను… ప్రత్యేక మతహోదా పేరుతో ఆకట్టుకున్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ అనే భావన పెంచేలా బీజేపీ తరహా రాజకీయాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ గా ఉంది.
బీజేపీ… ఇప్పటి వరకు తిరుగులేని విజయాలు నమోదు చేసింది. కానీ కర్ణాటకలో ఓడిపోతే.. ఆ విజయాల్ని బీజేపీ కార్యకర్తలు కూడా గుర్తించని పరిస్థితి ఉంది. అందులో బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పరిస్థితులు అనుకూలంగా లేవని..ముందుగా వద్దనుకున్న గాలి జనార్దన్ రెడ్డికి కూడా దగ్గరకు తీసుకుంది. కర్ణాటకలో ఎన్నికల్లో ఓడిపోతే.. ఆ ప్రభావం ఏడాది చివరిలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికలపై పడుతుంది. అక్కడి బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఉపఎన్నికల్లోవెల్లడయింది. కర్ణాటకలో ఓడిపోతే..అక్కడా ఓటమిని ఖరారు చేసుకోవాల్సి వస్తుంది. అంటే సాధారణ ఎన్నికల్లో చేతులెత్తేసినట్లేనని చెప్పుకోవాలి.
కర్ణాటక ఎన్నికల్లో.. బీజేపీ ఓడిపోతే.. రాజకీయ సమీకరణాలు మాత్రం వేగంగా మారిపోతాయి. కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు మరికొన్ని పార్టీలు ముందుకు వస్తాయి. బీజేపీని వదిలేందుకు మరిన్ని పార్టీలు సిద్ధమవుతాయి. ఒక్కసారి గ్రాఫ్ పడిపోవడం అంటూ ప్రారంభమైతే.. ఆపడం ఎవరి తరం కాదు. మోదీ ఇమేజ్ కూడా ఆ పరిస్థితులకు అతీతమయ్యే అవకాశం లేదు. అందుకే కర్ణటాక ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ లకు క్వార్టర్ ఫైనల్లాంటివి. ఇక్కడ గెలవకపోతే..మెరిట్ పాయింట్లకు తేడాపడి..క్లైమాక్స్ ఫైట్ లో ఓటమి ఖాయమవుతుంది.