కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మత అసహనం, రచయితలపై దారులు పెరిగిపోతున్నాయని పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నాయి. కారణాలు ఏవతేనేమి కొందరు ప్రముఖ రచయితలు, కళాకారులు తమ అవార్డులను కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పన్నిన ఈ పద్మవ్యూహం నుండి మోడీ ప్రభుత్వం బయటపడలేక అవస్తపడుతుంటే, మరోవైపు బీజేపీకి అనుబంధ హిందూ ధార్మిక సంస్థలు బీజేపీని ఆ పద్మవ్యూహంలో ఇంకా ఇరికిస్తున్నారు.
ప్రస్తుతం కర్నాటకలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల వ్యహారంలో జరుగుతున్న రగడ గమనిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు చేపట్టిన నిరసనలలో అల్లర్లు జరగడం వాటిలో అనేకమంది గాయపడటం, ఒకరు మృతి చెందడం వంటి సంఘటనలన్నీ నేరుగా బీజేపీకి, మోడీ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చేవిగా ఉన్నాయి. అలాగే ఈ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ కన్నడ రచయిత, నటుడు గిరీష్ కన్నాడ్ చేసిన విజ్ఞప్తిపై హిందూ సంస్థలకు చెందిన కొందరు కన్నెర్ర చేయడంతో ఆయన క్షమాపణ చెప్పవలసి రావడం కాంగ్రెస్ వాదనలకు బలం చేకూర్చేదిగా ఉంది. ఈ పరిణామాలను బీజేపీ అదుపు చేయలేక పోవడంతో మోడీ ప్రభుత్వమే ఆ అపవాదును భరించవలసి వస్తోంది.
నిజానికి కర్నాటక ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలనుకోవడానికి వేరే కారణాలున్నాయి. త్వరలో ఆ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మైనార్టీ వర్గాలను ఆకట్టుకోనేందుకే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంఈ ఆలోచన చేసింది. కానీ అది ఒకటి తలిస్తే మరొకటి జరుగుతోంది. అయినా కూడా ప్రస్తుతం జరుగుతున్న ఈ విపరీత పరిణామల వలన కూడా రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఊహించనివిధంగా లబ్ది కలుగుతోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మత అసహనం, రచయితలపై దాడులు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ చేస్తున్న వాదనలకు బలం చేకూర్చుతోంది. అదేవిధంగా కర్నాటక రాష్ట్రంలో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ఇకనయినా బీజేపీ మేల్కొని తన అనుబంధ సంస్థలని వాటి నేతలని నియంత్రించకపోయినట్లయితే మోడీ ప్రభుత్వం పట్ల దేశ వ్యాప్తంగా మరింత వ్యతిరేకత పెరగవచ్చును. దాని వలన అంతిమంగా బీజేపీయే నష్టపోతుంది.