‘కాలా’ కష్టాలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ఈ సినిమా విడుదలని అడ్డుకుంటూ.. అక్కడి ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సవాలు చేస్తూ.. ధనుష్ కర్ణాటక హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోట్లు చేతులెత్తేసింది. ‘కాలా విషయంలో జోక్యం చేసుకోలేం’ అంటూ తేల్చేసింది. ఈ సినిమాని ప్రదర్శించమని మేం చెప్పలేం.. కానీ ప్రదర్శిస్తే మాత్రం థియేటర్ల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసేలా చూస్తాం అని హై కోర్టు తేల్చింది. ‘మా సినిమాని కావాలని అడ్డుకుంటున్నారు’ అన్నది ధనుష్ లాయర్ల వాదన. అయితే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ‘కాలా సినిమాని ఎవరూ కొనలేదు… అందుకే విడుదల కావడం లేదు’ అంటున్నారు. ఎవరూ కొనకపోతే.. సొంతంగా విడుదల చేసుకునే వీలు ఉంది కదా? కానీ అందుకోసం థియేటర్లు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఒకవేళ కాలా విడుదలైతే.. కర్ణాటకలో శాంతిభద్రతల సమస్య వస్తుందని కర్ణాటక ప్రభుత్వం వాదించింది. దాంతో కోర్టు కూడా ఏకీభవించింది. కాలా విడుదలకు ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. ఈలోగా కర్ణాటకలో ఈ సమస్య తేలిపోయే ఛాన్సే లేదు. ధనుష్ చివరి ప్రయత్నం కూడా.. నీరుగారిపోయింది. ఇక కర్ణాటకలో కాలా విడుదల కావడం అసాధ్యమే అనుకోవాలి.