ఎన్నికలబాండ్ల పేరతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని .. దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి వారిని భయపెట్టి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారన్న ఆరోపణలపై నిర్మలా సీతారామన్‌పై నమోదైన కేసు దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు దేశంలోనే సంచలనం సృష్టించింది. ఓ సామాజిక కార్యకర్త చాలా కాలం పోరాడి కోర్టు ద్వారా ఈ కేసు నమోదు చేయించారు. అయితే దర్యాప్తు ప్రారంభం కాక ముందు హైకోర్టు నుంచి నిర్మలా సీతారామన్ స్టే తెచ్చుకున్నారు.
ఎలక్టోరల్ బాండ్స్ చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వాటి వివరాలన్నీ బయట పెట్టాలని ఆదేశించింది. ఆ మేరకు ఎస్బీఐ ఆ వివరాలన్నీ వెల్లడించింది. అందులో బీజేపీకే సింహభాగం దక్కాయి. ఎవరెవరు ఇచ్చారో కూడా బయటపడింది. అందులో ప్రధానంగా ఐటీ, ఈడీ దాడులు జరిగిన కంపెనీలు ఉండటం ఆ ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఆ దాడులు జరిగిన తర్వాతే ఇవ్వడంతో ఇందులో పెద్ద స్కాం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే కేంద్రం లో అధికారంలో ఉన్నది బీజేపీనే కాబట్టి కేసుల వరకూ వెళ్లలేదు. దర్యాప్తు గురించి అసలు చెప్పాల్సిన పని లేదు.
అయితే కర్ణాటకకు చెందిన ఓ సామాజిక కార్యకర్త మాత్రం వదిలి పెట్టలేదు. కోర్టుకెళ్లి పోరాడి కేసు నమోదుకు ఆదేశాలు తెచ్చారు . సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తే హైకోర్టు కూడా సమర్థించింది. నిర్మలా సీతారామన్‌కు మాత్రం రిలీఫ్ లభించింది. ఇరవై రెండో తేదీ తర్వాత మరోసారి కర్ణాటక హైకోర్టు విచారణ జరపనుంది.