“ఒక మహిళను ఇద్దరు రేప్ చేస్తే దానిని సామూహిక అత్యాచారం అని ఎలాగ అంటాము?” అని ప్రశ్నించినందుకు నెల రోజుల క్రితం కర్నాటక హోం మంత్రి కే.జె. జార్జ్ తన పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలోకి కొత్తగా వచ్చిన జి.పరమేశ్వర్ కూడా మహిళల పట్ల అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసారు.
మొన్న బుధవారం నాడు బెంగళూరులో కబ్బన్ పార్క్ సమీపంలో గల ఒక టెన్నిస్ క్లబ్ లో 30 ఏళ్ల మహిళని అందులో పనిచేస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అత్యాచారం చేసారు. ఆమె బుదవారం రాత్రి సుమారు 9.30 గంటలకు సభ్యత్వం తీసుకోవడానికి టెన్నిస్ క్లబ్ కి వెళ్ళింది. కానీ ఆమెను మరునాడు రమ్మని చెప్పడంతో ఆమె తిరిగి వెళ్లిపోతుంటే, అక్కడే ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఆమెకు మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారం చేసారు.
దీనిపై బెంగళూరులో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. నగరం నడిబొడ్డునే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించిన కొత్త హోం మంత్రి పరమేశ్వర విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామని ఇచ్చి ఉండాలి. కానీ ఆయన “అంత రాత్రప్పుడు ఆ మహిళకు క్లబ్బుకి వెళ్లి టెన్నిస్ ఆడవలసిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించడంతో “ఆమె ఆ సమయంలో అక్కడికి వెళ్ళడమే తప్పు అందుకే రేప్ చేయబడింది,” అన్నట్లయింది. మంత్రిగారు మాట్లాడిన ఈ మాటలకి మహిళా సంఘాలు తీవ్రంగా నిరసనలు తెలియజేస్తున్నాయి. బహుశః ఈయన కూడా మంత్రిపదవి నుండి తప్పుకోవలసి వస్తుందేమో?”