కర్ణాటక భగ్గుమంది. టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడంపై హిందూత్వ సంస్థలు ఇప్పటికే మండిపడ్డాయి. ఇప్పుడు ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. టిప్పు సుల్తాన్ 1750 నవంబర్ 20న జన్మించాడని చరిత్రకు సంబంధించిన అనేక పాఠాల్లో ఉంది. వికీపిడియాలోనూ అదే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈనెల 10న టిప్పు జయంతిని అధికారికంగా జరిపింది.
నవంబర్ 10 టిప్పు జయంతి కాదు. నిజానికి అది ఓ చీకటి రోజంటున్నారు చరిత్రకారులు. నవంబర్ 10నాడే కర్ణాటకలోని మెల్కోటే అనే పట్టణంలో 700 మంది అయ్యంగార్లను టిప్పు సుల్తాన్ ఉరి తీయించాడని బెంగళూరు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ సూర్యనారాయణ రావు చెప్పారు. చరిత్రకారులను సంప్రదించి తాను ఈ విషయం రూఢి చేసుకున్నానని తెలిపారు. అంత దారుణం జరిగిన రోజున వేడుక జరపండం అంటే ఆ వర్గం వారి సెంటిమెంటును దెబ్బ తీయడమే అనే విమర్శలు వస్తున్నాయి. ఆనాటి దారుణానికి నిరసనగా, ఆ ప్రాంతంలోని అయ్యంగార్లు ఇప్పటికీ దీపావళి పండుగ జరుపుకోవడం లేదట. ఇప్పుడు వారిని బాధ పెట్టేలా ప్రభుత్వం వ్యవహరించినట్టయింది.
కూర్గ్ గా ప్రసిద్ధి చెందిన కొడగు ప్రాంతంలోని ప్రజలు కూడా టిప్పు జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాంతంలో ఒకప్పుడు టిప్పు సుల్తాన్ అనేక అకృత్యాలకు పాల్పడ్డాడని వారు చెప్తున్నారు. మహిళలు, పిల్లలు ఎక్కువగా టిప్పు దాష్టీకాలకు బలయ్యారని కొడగు ప్రాంత వాసులు చెబుతున్నారు. తాజా వివాదం తలెత్తిన తర్వాత కొడగు ప్రాంతానికి వెళ్తున్న మీడియా ప్రతినిధులకు అక్కడి ప్రజలు టిప్పు సుల్తాన్ గురించి వివరిస్తున్నారు. టిప్పు సుల్తాన్ అనేక అరాచకాలు చేశాడని, తమ పూర్వీకులు చెప్పిన విషయాలు వివరిస్తున్నారు.
దాదాపు మూడు శతాబ్దాల తర్వాత హటాత్తుగా టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా జరపడం కేవలం ఓట్ల కోసమే అని బీజేపీ ఆరోపిస్తోంది. ఒక వర్గ ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా మైనారిటీలంటూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. పైగా, టిప్పు పుట్టిన రోజు నాడు కాకుండా, మారణకాండ సాగించిన రోజున వేడుక జరపడం అమానవీయమని సంఘ్ పరివార్ ముఖ్యమంత్రిని దుయ్యబట్టింది.