కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నిదలు జరిగిన తర్వాత మూడేళ్లలో నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం జరుగుతోంది. మొదటి సారి యడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ మెజారిటీ లేదు. దాంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత కుమారస్వామి ప్రమాణం చేశారు. ఆయనను గట్టిగా ఏడాది కూడా పదవిలో ఉండనీయకుండానే.. బీజేపీ పదవి లాక్కుంది. మళ్లీ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. ఆయన కూడా రెండేళ్లు కాకుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది. నాలుగో ప్రమాణస్వీకార వేడుకలో బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి అవుతున్నారు. మూడేళ్లలో ముగ్గురు సీఎంలు .. నాలుగు సార్లు ప్రమాణస్వీకారం చేశారన్నమాట.
బసవరాజ్ బొమ్మై పేరు ముఖ్యమంత్రి పదవికి ఎక్కువగా వినిపించలేదు. కానీ బీజేపీ హైకమాండ్ ఆయన పేరును ఖరారు చేయడానికి కారణం.. యడ్యూరప్పనే. ఆయన తనను రాజీనామా చేయించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ విషయం ఆయన కన్నీటితోనే తెలిసిపోయింది. ఆయన తాను గవర్నర్‌గా వెళ్లదల్చుకోలేదని రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఇలాంటి సమయంలో ఆయన సొంత పార్టీ పెడతారన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో యడ్యూరప్పసొంత పార్టీ పెట్టడంతో బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ అదే పరిస్థితి తయారైతే… అటు లోక్‌సభ తో పాటు ఇటు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ ఇచ్చినట్లు అవుతుందన్న ఉద్దేశంతో … యడ్యూరప్పను బుజ్జగించడానికి హైకమాండ్ గట్టి ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా.. ఆయన చెప్పిన బసవరాజ్ బొమ్మైనే ముఖ్యమంత్రిగా నియమించాలని నిర్ణయించింది.
హైకమాండ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. బ్రహ్మణ సామాజికవర్గానికి ఈ పదవి ఇస్తారని చెప్పుకున్నారు. కానీ లింగాయత్‌కు ఆగ్రహం తెప్పిస్తే.. పార్టీ మనుగడ కష్టం అవుతుందని లెక్కలేసుసుకున్నారు. కర్ణాటకలో లింగాయత్‌లకు అతి ముఖ్యమైన లీడర్‌గా యడ్యూరప్పనే ఉన్నారు. ఆయనను దాటి బీజేపీ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. గతంలో యడ్యూరప్ప అవినీతి ఆరోపణపై రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు.. సదానందగౌడను.. ఆయన సూచనలతోనే నియమించారు. ఇప్పుడు కూడా బసవరాజ్ బొమ్మైను… కూడా యడ్యూరప్పే సూచించారు.
ముఖ్యమంత్రిగా బొమ్మై ఉన్నా.. యడ్యూరప్ప చక్రం తిప్పుతారని బీజేపీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. బొమ్మై.. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడు. ఆయన స్వతహాగా బీజేపీ నేత కాదు. మధ్యలో వచ్చారు. ఎప్పట్నుంచో బీజేపీలో ఉన్న నేతలు ఇప్పుడు అసంతృప్తికి గురి కావడం ఖాయం. అందర్నీ సర్దుబాటు చేసుకుని.. బొమ్మై లెక్కలు సరి చేసుకోవాల్సి ఉంటుంది. 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు జరగనున్నాయి.