కర్ణాటక రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంఖ్యాబలం ఉంది. కానీ, ముందుగా గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. గవర్నర్ నిర్ణయం మరింత జాప్యం జరిగేలా ఉందని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇరు వర్గాలతో చర్చలు జరిపిన తరువాత నిర్ణయం ప్రకటిస్తారట! నిజానికి, ఇప్పటికే పార్టీల నేతలు గవర్నర్ ను కలుసుకున్నారు. అయినాసరే, మరోసారి భేటీ అంటుండటం గమనార్హం. మరోపక్క, 104 స్థానాలు గెలుచుకున్న భాజపాకి కొద్దిమంది మద్దతు లభిస్తే చాలు… ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆకర్ష్ రాజకీయాలు ఎలా చేయాలో భాజపాకి చాలా అనుభవమే ఉంది కదా! ప్రస్తుతం అదే పనిలో ఉందని అనుమానం.
ఈ ఊహాగానాలను మరింత బలం చేకూరే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు అదృశ్యం కావడం ఇప్పుడు చర్చనీయం అవుతోంది. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి గెలుపొందిన 78 మంది సభ్యులూ హాజరు కావాల్సి ఉంది. కానీ, 12 మంది గైర్హాజరయ్యారు. దీంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జేడీఎస్ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కనిపించుట లేదట! ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు భాజపా గాలం వేయడం మొదలుపెట్టిందని నిన్నట్నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు భారీ సొమ్ముతోపాటు, మంత్రి పదవులను కూడా ఎర వేస్తోందంటూ తెలుస్తోంది. దీంతో, కాంగ్రెస్, జేడీఎస్ లలో కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలు భాజపా గూటికి చేరారా..? భాజపా వేసిన ఎరకి లొంగిపోయారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఇప్పటికే ఓ స్వతంత్ర అభ్యర్థి భాజపాకి మద్దతు ప్రకటించడంతో వారి బలం 105కు చేరింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన నరేంద్ర, ఆనంద్ సింగ్ లు బళ్లారి గనుల వ్యాపారులే. వీరికీ గాలి జనార్థన్ రెడ్డికీ మంచి వ్యాపార సంబంధాలే ఉన్నాయి. దీంతో వారూ భాజపా గూటికే చేరుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే భాజపాకి కావాల్సింది మరో ఏడుగురు మాత్రమే. మరి, అదృశ్యమైన ఎమ్మెల్యేంతా ఏమైనట్టు..? ఎక్కడున్నట్టు, ఎవరితో టచ్ లో ఉంటున్నట్టు అనే ప్రశ్నలతో కాంగ్రెస్, జేడీఎస్ లు తీవ్ర ఆందోళనకు గురౌతున్నాయి. ఇది భాజపా మార్కు రాజకీయమే అనిపిస్తోంది. గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో వారు అనుసరించిన నీతిమంతమైన రాజకీయ విధానం ఇలాంటిదే కదా!