కర్ణాటక రాజకీయాలు పూర్తిగా మత పరంగా మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయినా అడ్డదిడ్డమైన పద్దతులతో అధికారం అనుభవిస్తున్న బీజేపీ పాలనా పరంగా వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నాలను మత కోణంలో చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యడ్యూరప్పను సీఎంగా తొలగించి బస్వరాజ్ బొమ్మైను సీఎంను చేశారు. అయితే అది మరింత బ్యాడ్ గా మారిందని బీజేపీ భావిస్తున్న సమయంలో .. హఠాత్తుగా ఎజెండా మారిపోయింది. హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. దీంతో కర్ణాటక కొన్ని రోజుల పాటు అట్టుడికిపోయింది.
చివరికి హిజాబ్‌తో ముస్లిం విద్యార్థులు స్కూలుకు వెళ్లవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు కారణంగా ఆ వివాదానికి తాత్కాలికంగా పుల్‌స్టాప్ పడింది. విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇలా సైలెంట్‌గా ఉంటే ఎట్లా అనుకున్నారేమో కానీ కర్ణాటక బీజేపీ నేతలు హలాల్ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. హలాల్ చేసిన మాంసాన్ని కొనుగోలు చేయవద్దని.. అది ఆరోగ్యానికి హానికరం అని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి చేసిన వ్యాఖ్యలతో దుమారం ప్రారంభమైంది. హలాల్ వర్సెస్ నాన్ హలాల్ చర్చ ప్రారంభమయింది. హిందువులు అమ్ముతున్న మాంసాహార దుకాణాల్లో ముస్లింలు కొనుగోలు చేయరని.. ముస్లిం దుకాణాల్లో హిందువులు ఎందుకు కొనుగోలు చేయాలని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇది ఆర్థిక జీహాద్ అంటున్నారు. ఇప్పుడీ వివాదం అంతకంతకూ పెరిగిపోతోంది. హలాల్ చేసిన ఆహారాన్ని హిందువులు తినవద్దని బీజేపీ నేతలు పిలుపునిస్తున్నారు. ఎంతగా అంటే… తాజాగా హిమాలయ సంస్థ హలాల్ పాలసీని ఎప్పుడో ప్రకటించింది. ఆ పాలసీని సోషల్ మీడియాలో చూపిస్తూ ఇక హిమాలయ ఉత్పత్తులు ఎవరూ కొనవద్దని పిలుపునిస్తున్నారు. బాయ్ కాట్ హిమాలయ అని పరేష్ రావల్ లాంటి వారు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో కానీ కర్ణాటక రాజకీయాలు మాత్రం పూర్తిగా మత కోణంలోకి మారిపోతున్నాయి. కర్ణాటకలో అంటుకుంటున్న అగ్గి… దేశం మొత్తానికి వ్యాపిస్తూండటమే ఆందోళనకరం.