కర్ణాటక ఎన్నికలపై ఆంధ్రాలో కూడా కొంత ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే, అక్కడ దాదాపు నలభై నియోజక వర్గాల్లో తెలుగువారి సంఖ్య గణనీయంగా ఉంది. అయితే, ఈసారి వీరంతా భాజపాకి ఓట్లు వెయ్యడం అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా అనుసరిస్తున్న వైఖరిపై ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగువారు కూడా కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. అంతేకాదు, భాజపాకి ఓటెయ్యొద్దంటూ ఇప్పటికే అక్కడి తెలుగు ప్రజలకు టీడీపీ పిలుపునిచ్చింది. జేడీఎస్ కు మద్దతు ఇవ్వాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అక్కడి తెలుగువారిని కోరారు.
ఈ నేపథ్యంలో అక్కడి తెలుగు సంఘాల మధ్య గొడవలు రావడం విశేషం. బెంగళూరులోని సదరన్ హోటల్లో తెలుగు సంఘాలు సమావేశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక పేరిట ఈ కార్యక్రమం ఏర్పాటైంది. అయితే, ఈ కార్యక్రమం కూడా రాజకీయ రంగు పూసుకుంది. ఏపీ ప్రయోజనాల గురించి చర్చిద్దామంటూ పిలిచిన ఈ సమావేశాన్నీ తెలుగుదేశం పార్టీ సమావేశంగా మార్చారంటూ ఒక వర్గం వాదనకు దిగింది. కొంతమంది వైకాపా సభ్యులు కావాలనే ఈ సమావేశంలో గొడవలు సృష్టించేందుకు వచ్చారంటూ మరో వర్గం వాదనకు దిగింది. దీంతో అక్కడి తెలుగు సంఘాలు రెండుగా చీలిపోయాయి. రెండు వర్గాల మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది.
నిజానికి, ఎన్నికల్లో ఎవరికి మద్దతు పలకాలన్న అంశాన్ని ఈ సమావేశంలో చర్చించాలని భావించారు. హాలు నిండిపోయిన తరువాత కొంతమంది వచ్చారనీ, వారికి సంఘాల్లో సభ్యత్వాలు కూడా లేవని ఒక వర్గం వారు అంటున్నారు. తామూ తెలుగువారమేననీ ఇక్కడ జరిగే సమావేశానికి వస్తే తప్పేంటని ఇంకో వర్గం వాదించింది. ఈ గందరగోళం నేపథ్యంలో పోలీసులు కల్పించుకుని, హోటల్ నుంచి అందర్నీ పంపించేశారు. విచిత్రం ఏంటంటే… కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ, వైకాపాలు లేవు కదా! అలాంటప్పుడు, ఆ పార్టీల పేరుతో ఈ వాగ్వాదాలేంటో మరి..? ఇది టీడీపీ కార్యక్రమంలా ఉందని అనడం, వైకాపా వారు అడ్డు తగలారని అనడం చిత్రంగా ఉంది. ఎందుకంటే, కర్ణాటకలో తెలుగువారంతా ఎవరికి ఓటెయ్యాలన్న నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు… టీడీపీ, వైకాపాల ప్రస్థావనే అనవసరం కదా! సరే.. ఒకవేళ ఈ పార్టీలే అక్కడా ప్రాతిపదిక అనుకున్నా… ఏపీ ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైకాపాలు పోరాటం చేస్తున్నాయి. అంటే, రెండూ కేంద్రంలోని భాజపాకి వ్యతిరేకంగా ఉన్నట్టే కదా! అలాంటప్పుడు మరో అభిప్రాయానికి ఆస్కారం ఎక్కడుంది..? ఈ సంఘాలు రెండుగా చీలాల్సిన అవసరం ఏముంది..? ఈ మాత్రం చోటిస్తే చాలు… అక్కడ కూడా భాజపా అల్లుకుపోగలదు.