ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే.. ఇంగ్లీష్‌లో మాట్లాడుకొంటారని తెలుగోళ్ల గురించి ఓ జోక్ ఉందిలెండి. అది జోక్ కాదు.. నిజ్జంగా నిజ్జం అని మనవాళ్లు నిరూపించేస్తుంటారు. 24 ఆడియో ఫంక్షన్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వంశీపైడిపల్లి, డి.సురేష్ బాబు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడారు. పక్కనున్న సుమ ‘తెలుగు.. తెలుగు..’ అని ఎంత మొరపెట్టుకొన్నా.. వినలేదు. పైగా సురేష్ బాబు అయితే.. ‘నాకు తెలుగు రాదు..’ అని మైకు ముందే చెప్పేశాడు.
కానీ ఆ తరవాత మైక్ అందుకొన్న కార్తి అచ్చమైన తెలుగబ్బాయ్లా స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాడు. సూర్య కూడా అంతే. చెన్నై సుందరి సమంత ఎప్పట్లా తెలుగులోనే మాట్లాడింది. అంతెందుకు రెహమాన్ కూడా తన తొలిపలుకులు తెలుగులోనే వినిపించాడు. తమిళ తంబీలకు తెలుగుపై ఇంత మమకారం ఉంటే.. మన వాళ్లకు ఏమైంది?? తెలుగు భాషను గౌరవించుకొనేది ఇలాగేనా..?? తమిళ తంబీలకు తమ భాషపై మమకారం ఎక్కువ. తమిళ నాడు వెళ్లండి.. అక్కడ తమిళంలోనే మాట్లాడతారు. తెలుగునాటకు వచ్చి.. తెలుగు పై గౌరవంతో తెలుగులో మాట్లాడుతుంటే.. మనం మాత్రం ఇంగ్లీష్ అందుకొంటున్నాం. హతవిథీ… తెలుగువాళ్లు ఎప్పుడూ ఇంతేనా?