అన్నయ్య సూర్యలానే కార్తి కూడా కొత్తగా ఆలోచిస్తాడు. ప్రయోగాలకు అస్సలు వెనుకంజ వేయడు. అందుకే అతన్నుంచి ‘యుగానికి ఒక్కడు’, ‘కాష్మోరా’లాంటి సినిమాలొచ్చాయి. తెలుగు నేర్చుకుని, తెలుగులోనే మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. ఇటీవల ‘ఖాకీ’తో మంచి విజయాన్ని అందుకున్న కార్తి ఇప్పుడు `చినబాబు`గా ముస్తాబయ్యాడు. శుక్రవారం ‘చినబాబు’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా కార్తితో చిట్ చాట్
* చినబాబు సంగతులేంటి? ఈ సినిమా చేయడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయా?
– చినబాబు నా మనసుకి నచ్చిన కథ. ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో కథానాయకుడ్ని… అన్నయ్యగా చూపించారు. ఈసారి అయిదుగురు అక్కల తమ్ముడ్ని. ఇంట్లో అందరికంటే చిన్నవాడ్ని. ఆ ఆలోచనే నాకు కొత్తగా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా నాకో పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు దర్శకుడు. ఇది వరకు కొన్ని సినిమాల్లో నన్ను అనాథగా చూపించారు. కొన్ని సినిమాల్లో తండ్రి పాత్ర లేనే లేదు. ఈసారి అలా కాదు… చుట్టూ బోలెడంత మంది నటీనటులు. సెట్‌కి వెళ్తే… ఓ జాతరకు వెళ్లినట్టు ఉండేది. దర్శకుడు పాండిరాజ్ శైలి నాకు ఇష్టం. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయనతో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అన్నయ్యకు ఆ అవకాశం దక్కింది.. నాకు ఇప్పుడు లభించింది.
* మీ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి?
– ఇందులో నేనో రైతుని. తండ్రి ఇంజనీర్ అయితే వారసులు కూడా ఇంజనీరో, డాక్టరో అవుతుంటారు. కానీ రైతు కొడుకు మాత్రం రైతు కాడు. ఈ సినిమామాలో అలా లేదు. ‘నేను రైతుని’ అని గర్వంగా చెప్పుకునే పాత్ర అది. బండి నెంబరు ప్లేటు ముందు.. పోలీస్, ప్రెస్ అని గర్వంగా రాసుకున్నట్టు ‘ఫార్మర్’ అని రాసుకుంటాడు. రైతు అంటే అంత ఇష్టం. తనది చాలా పెద్ద కుటుంబం. ఓరోజు నాన్న పిలిచి… ఇంటి బాధ్యతలన్నీ తన చేతిలో పెడతాడు. తన అక్కల్ని, బావల్ని, వాళ్ల పిల్లల్నీ, ఆ ఇంటి మొత్తాన్ని నడిపించాల్సింది తనే అన్నమాట. అక్కడి నుంచి కథ ఏమయ్యింది? అనేది తెరపై చూడాలి.
* ప్రచార చిత్రాలు చూస్తుంటే తమిళ వాసన ఎక్కువగా కనిపిస్తోంది. మరి తెలుగు నేటివిటీ మాటేంటి?
– వేషధారణలో తమిళ సినిమా పోకడలు ఎక్కువగా కనిపించొచ్చు. కాకపోతే.. పల్లెటూర్లు ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. అక్కడి అనుబంధాలు, ఆప్యాయతలు మారవు. ఈ సినిమాలో నేను గోదావరి యాసలో డైలాగులు చెప్పా. తెలుగు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది.
* రైతు సినిమా అంటున్నారు కాబట్టి… వాళ్ల కష్టాలు, కన్నీళ్లూ ఏకరువు పెట్టే ఛాన్సుంది అనుకుంటారు కదా?
– రైతులంటే అవి మాత్రమే కాదండీ. హ్యాపీగా బతికే రైతులూ ఉన్నారు. మీడియా ఎప్పుడూ వాళ్ల కన్నీళ్లే చూపిస్తుంది. సరిగా పంట పండించుకుంటే, వర్షాలు ఎకక్కువగా పడి, వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు వస్తే… తప్పకుండా పంటలు బాగా పండుతాయి. కేరళలో ఓ గ్రామంలో పూర్తిగా సేంద్రియ పద్ధతులపైనే వ్యవసాయం జరుగుతోంది. అక్కడ రైతులంతా హ్యాపీగా ఉన్నారు. దేశమంతా.. ఈ పద్ధతిలోనే వ్యవసాయం చేయాలి. ఎరువులు, పురుగు మందులు వాడి భూమిని కలుషితం చేసేశారు. మళ్లీ జీవం రావాలంటే కొంత శ్రమించక తప్పదు.
* మీకు పల్లెటూరి వాతావరణం అలవాటు ఉందా?
– ఉంది.. సెలవు దొరికితే పల్లెటూరికి వెళ్తుంటా. నేనే కాదు. మా పాపకీ ఆ వాతావరణం పరిచయం చేస్తున్నా. మనదైన మూలాలు పల్లెటూర్లలోనే ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నా.
* పల్లెలు కూడా పట్నాలుగా మారాలని ఆరాటపడుతున్నాయి. చుట్టూ పచ్చదనం మాయం అవుతోంది కదా?
– అవును. అది చాలా ప్రమాదకరమైన విషయం. మన పిల్లల్ని కాంక్రీట్ జంగిల్లో పెంచుతున్నాం. కనీసం ఆడుకోవడానికి కూడా సరైన సదుపాయాలు కల్పించడం లేదు. వ్యవసాయం అంటే ఏమిటో, పల్లెటూర్లంటే ఎలా ఉంటాయో వాళ్లకు చూపించాలి.
* ఈ చిత్రానికి అన్నయ్యే నిర్మాత కదా? ఆయన ఈ సినిమా విషయాల్లో జోక్యం చేసుకున్నారా?
– లేదండీ.. ఆయన సెట్‌కే రాలేదు. అదంతా దర్శకుడిపై నమ్మకంతోనే. నా డబ్బింగ్ చూసి మాత్రం ‘ఇదేంట్రా… ఇలా చెప్పావు.. మళ్లీ చెప్పు’ అంటూ కొన్ని కరక్షన్స్ చెప్పారు.
* అన్నయ్యతో కలసి సినిమా చేయడం లేదెందుకని?
– రెండేళ్లుగా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. మంచి కథ సెట్ అవ్వడం లేదు. దొరికితే తప్పకుండా చేస్తాం. ఏదో ఒకటి చేసేస్తే చాలు అనుకుని ‘ఇలాంటి సినిమా చేశారేంటి’ అనిపించుకోకూడదు.
* ఊపిరి తరవాత తెలుగులో మరో సినిమా చేయలేదు.. కారణం?
– అంత బలమైన కథ రాలేదు. అందుకే తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఊపిరి లాంటి సినిమా కోసమే చాలా ఏళ్లుగా ఎదురుచూశా. మళ్లీ అలాంటి కథ దొరికే వరకూ ఎదురు చూస్తా.
* అన్నయ్యలా మీరూ నిర్మాతగా మారతారా?
– లేదండీ.. అన్నయ్య అంటే చాలా అనుభవం ఉంది. నాకంటే ముందే వచ్చాడు. నేనొచ్చి పదేళ్లు కూడా కాలేదు.
* దర్శకుడవుదామనుకున్నారు కదా? ఆ ప్రయత్నాలేం చేయట్లేదా?
– నిజంగానే దర్శకుడ్ని అవుదామనే వచ్చా. కాకపోతే.. నేను పనిచేసిన దర్శకుల్ని చూస్తే `మనకిదంతా అవసరమా` అనిపించింది. దర్శకత్వం ఎప్పుడైనా చేయొచ్చు. యాభై దాటక కూడా విశ్వనాథ్ గారిలా మంచి మంచి సినిమలు చేయొచ్చు. నటనకు మాత్రం వయోపరిమితి ఉంటుంది. అందుకే ముందు నటించి, ఆ తరవాత దర్శకత్వం వైపు ఆలోచించాలని డిసైడ్ అయ్యా.