తెలుగులో మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో కార్తీ ఒకడు. తన సినిమాలు ఇక్కడ బాగానే ఆడుతుంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రచారం చేస్తుంటాడు. విడుదలకు ముందు మీడియాని కలిసి, ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్లిపోతుంటాడు. అయితే.. ‘చినబాబు’ విషయంలో ఈ ప్రచార ఆర్భాటం ఇంకాస్త ఎక్కువైంది. ఏపీ, తెలంగాణల్లో సక్సెస్ టూర్లు మొదలెట్టాడు కార్తి. హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగిన సక్సెస్ మీట్‌కి ఆటోలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘ట్రాఫిక్ ఎక్కువని ఆటోలో వచ్చా’ అంటున్నా… నిజానికి ఇదంతా పబ్లిసిటీ ట్రిక్కు. నిజానికి ‘చినబాబు’కి అంత ఫేవర్‌గా రివ్యూలేం రాలేదు. బయట టాక్ కూడా అంతంత మాత్రమే. ఎలాగోలా జనాన్ని థియేటర్లకు రప్పించాలన్న మిషన్‌తో కార్తి ఇంత హడావుడి చేస్తున్నాడు. కార్తి గత చిత్రం ‘ఖాకీ’కి మంచి టాకే వచ్చింది. రివ్యూలూ ‘ఆహా’ అన్నాయి. అయితే.. ఆ సమయంలో ఇంత ప్రచారం చేసుకోలేకపోయాడు కార్తి. అప్పటికీ ఇప్పటికీ తేడా `సొంత సినిమా`. ఈ సినిమాకి సూర్య నిర్మాత. కాబట్టి… వసూళ్లని పెంచుకోవడానికి కార్తి ఇంత కష్టపడుతున్నాడు. సొంత సినిమా అనేసరికి అందరికీ జాగ్రత్త వచ్చేస్తుంటుంది.. తప్పులేదు. కాకపోతే.. అదే జాగ్రత్త.. బయటి నిర్మాతలతో సినిమాలు తీస్తున్నప్పుడూ ఉంటే… బాగుంటుంది కదా.