విరూపాక్షతో మంచి హిట్టు కొట్టాడు కార్తీక్ దండు. ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు… నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించాడు. సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన సినిమా ఇది. స్వతహాగా తన శిష్యుల సినిమాలకు సుకుమార్ ఇలా రాత సాయం చేస్తుంటాడు. దాంతో.. ఈ సినిమా దర్శకుడు కార్తీక్ దండు కూడా సుకుమార్ శిష్యుడే.. అనుకొన్నారు. దసరా, ఉప్పెన సినిమాలతో సుకుమార్ శిష్యులు మెరిశారు. అందుకే ఈ విరూపాక్ష దర్శకుడ్నీ ఆ జాబితాలో కలిపేశారు. నిజానికి.. కార్తీక్ సుకుమార్ శిష్యుడు కాదు. తనతో ఏ సినిమాకీ పని చేయలేదు.
భం భోలేనాథ్ తో దర్శకుడు అయ్యాడు కార్తీక్. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ.. దర్శకుడిగా కార్తీక్ లో మేటర్ ఉందన్న విషయం ఇండస్ట్రీకి అర్థమైంది. మరో కథ రాసుకొని, ఓ నిర్మాతని పట్టుకొన్నాడు కార్తీక్. ఆ నిర్మాతకి సుకుమార్ బాగా సన్నిహితుడు. అలా.. ఈ కథ విన్న సుకుమార్, తాను కూడా పార్టనర్ గా మారడానికి ముందుకొచ్చాడు. ఈ సినిమాలోని క్లైమాక్స్ ట్విస్ట్ బాగుందని అందరూ మెచ్చుకొంటున్నారు. ఆ ట్విస్ట్ లో సుకుమార్ హ్యాండ్ ఉంది. రుద్రవనంలో వరుస హత్యలు జరుగుతున్నప్పుడు, ఆ పేట్రన్ ఎవరికీ అర్థం కాదు. ఆ హత్యలన్నింటికీ.. ఓ అండర్ లింక్ ఉండాలన్న ఆలోచన కూడా సుకుమార్దేనట. ఇవి రెండూ… కథాబలాన్ని పెంచేశాయి. అలా.. సుకుమార్ రైటింగ్ ఈ సినిమా విజయానికి దోహదం చేసింది.